అంగన్‌వాడీలపై నిర్బంధం ఆపాలి

left-parties-hunger-strike-support-to-anganwadis s
  • వామపక్షాల నిరాహార దీక్ష
  • వెంటనే చర్చలకు ఆహ్వానించి సమస్య పరిష్కరించాలని డిమాండ్‌
  • ప్రజలపై ప్రభుత్వ యుద్ధం : సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు కె రామకృష్ణ, వి శ్రీనివాసరావు
  • దీక్షలకు టిడిపి, జనసేన మద్దతు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అంగన్‌వాడీలపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపాలని, వారిని చర్చలకు ఆహ్వానించి సమస్యను పరిష్కరించాలని వామపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. జగనన్నకు చెబుదాం పేరుతో కోటి సంతకాలతో విజయవాడ చేరుకున్న వేలమంది అంగన్‌వాడీలపై ప్రభుత్వ, పోలీసు దౌర్జన్యాన్ని ఖండిస్తూ, వారితో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు నేతృత్వంలో వామపక్ష పార్టీల నాయకులు సోమవారం ఉదయం సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా అవసరమైతే నిరవధిక నిరాహార దీక్షగా మారుస్తామని, ట్రేడ్‌ యూనియన్లు నిర్ణయిస్తే రాష్ట్ర బంద్‌కు సిద్ధపడతామని నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదుపులోకి తీసుకున్న అంగన్‌వాడీలను వెంటనే విడుదల చేయాలని, చర్చలకు ఆహ్వానించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

దీక్షలను ప్రారంభించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ.. జగన్‌ మొండితనం వల్లే అంగన్‌వాడీలు ఆందోళన బాటపట్టారని పేర్కొన్నారు. ఇంత అహంకారం ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేరని విమర్శించారు. ఆయన అహంకార పూరిత వైఖరితో సమస్యను జఠిలం చేశారని పేర్కొన్నారు. తాను చెప్పిందే వేదమన్నట్లు అరాచక పాలన చేస్తున్నారని అన్నారు. అంగన్‌వాడీలు అత్యవసర సర్వీసులని 26 రోజుల తరువాత ప్రభుత్వానికి గుర్తు రావడం సిగ్గుచేటని అన్నారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరితే లక్షమందిని తొలగిస్తామని చెబుతున్నారని, అధికారం ఉన్నంత మాత్రాన అంతమందిని తొలగిస్తారా? అని ప్రశ్నించారు.

దీక్షలకు నాయకత్వం వహిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి వారిపైనే యుద్ధం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలపై పోలీసు నిర్బంధాన్ని ఆపి చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలన్నారు. తాము చేపట్టిన దీక్ష నిరవధికమా ఏమిటీ అనేది ప్రభుత్వ స్పందనపైనే ఆధారపడి ఉంటుందని హెచ్చరించారు. ‘నేను ఉన్నా.. నేను విన్నాను’ అని చెప్పిన ముఖ్యమంత్రి చెప్పుకుందామని వచ్చిన మహిళలపై అత్యంత పాశవికంగా దాడులు చేయించడం అన్యాయం, క్రూరత్వమని పేర్కొన్నారు. జగనన్నకు చెబుదాం అంటే.. అరెస్టులు చేయడమా? అని ప్రశ్నించారు. వారికి కనీస వేతనం ఇవ్వాలని మాత్రమే కోరుతున్నారని, డిఎ పాయింట్లు పెంచినా ఇప్పటికి రూ.2600కు పైబడి వేతనాలు పెరిగేవని తెలిపారు. అలా ఇవ్వని పక్షంలో పిఆర్‌సి ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరారు. చట్టప్రకారం సమ్మె నోటీసు ఇస్తే సమయం ఇవ్వాలని కోరిన ప్రభుత్వం ఎందుకు చర్చించలేకపోయిందని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి వారిపై వేధింపులకు పాల్పడుతోందని, ఇదే పద్ధతి కొనసాగితే జగన్‌మోహన్‌రెడ్డిని అధికారం నుండి దించి ఇంటికి పంపించే సమయం ఎంతో దూరం లేదని హెచ్చరించారు.

మాజీ మంత్రి, రైతు నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు దీక్షలకు మద్దతు ప్రకటించి మాట్లాడారు. అంగన్‌వాడీల సమ్మె న్యాయసమ్మతమైందని, సిఎం తనను ఎవరూ ప్రశ్నించకూడదనే ఒకే ఒక్క కారణంతో వారిపై వేధింపులకు దిగారని అన్నారు. శాంతియుతంగా సాధకబాధకాలు చెప్పుకుందామని వచ్చిన వారిపై దౌర్జన్యం చేయడం అన్యాయమని అన్నారు. మహిళల పట్ల మగ పోలీసులు అనుసరించిన వైఖరి సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. అంగన్‌వాడీల విషయంలో జగన్‌ అనుసరించిన వైఖరి ప్రజాస్వామ్య రాజ్యాంగ విరుద్ధమైందని అన్నారు. కేంద్రంలో పూర్తి నియంతృత్వ పోకడలకు పోతున్న మోడీకి ఇక్కడ వైసిపి, తెలుగుదేశం నాయకులు వంతపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెజ్లర్లు, రైతులు, మణిపూర్‌ ప్రజలపట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రధాని మోడీకి మద్దతు ఇవ్వడం మానుకోవాలని అన్నారు.

దీక్షలో కూర్చున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి ఈశ్వరయ్య మాట్లాడుతూ.. అంగన్‌వాడీల డిమాండ్లను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారో సిఎం సమాధానం చెప్పాలని అన్నారు. నియంతృత్వంగా వ్యవహరిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సిపిఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు హరికృష్ణ మాట్లాడుతూ.. అంగన్‌వాడీల చర్చల సమయంలో ఒకసారి డబ్బులు లేవని, మరొకసారి డబ్బులు ఉన్నా పెంచబోమని, అసలు సిఎంకే తెలియదని వేర్వేరు ప్రకటనలు చేసిన వారంతా మంత్రివర్గంలో ఉండటం దౌర్భాగ్యమని అన్నారు.సిపిఐఎంఎల్‌ లిబరేషన్‌ నాయకులు వీరబాబు మాట్లాడుతూ.. ఇచ్చిన హామీని నెరవేర్చమని కోరితే అరెస్టులకు పాల్పడిన సిఎంను ఇంతవరకు ఎక్కడా చూడలేదని అన్నారు. ఎవరితోనూ చర్చించని, మాట్లాడని సిఎంను రాష్ట్ర చరిత్రలో ప్రస్తుతం చూస్తున్నామని అన్నారు. నిరాహార దీక్ష ప్రారంభ సభకు అధ్యక్షత వహించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. అర్ధరాత్రి పూట రోడ్డుపై పడుకున్న మహిళలపై పోలీసులు విరుచుకుపడ్డారని, రాష్ట్ర చరిత్రలో ఇంతటి అన్యాయమైన చర్య మరొకటి లేదని, మహిళలని కూడా చూడకుండా వ్యవహరించారని అన్నారు.

దీక్షలకు మద్దతుగా పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు, ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ నాయకులు అజరుకుమార్‌, కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కె ప్రసన్న, డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు వై రాము, కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం హరిబాబు మాట్లాడారు. ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్‌ ఆధ్వర్యాన కళాకారులు అంగన్‌వాడీలకు మద్దతుగా పాటలు పాడి మద్దతు ప్రకటించారు.

దీక్షలకు టిడిపి, జనసేన మద్దతు

వామపక్షాల దీక్షలకు టిడిపి, జనసేన మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు సోమవారం దీక్షా శిబిరాన్ని టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కె పట్టాభిరామ్‌, జనసేన రాష్ట్ర నాయకులు బొలిశెట్టి వంశీకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్‌ మాట్లాడుతూ.. అంగన్‌వాడీల వేతనాలు పెంచితే నెలకు రూ.33 కోట్లు మాత్రమే అదనపు ఖర్చు అవుతుందని, అయినా ఎందుకు పెంచడం లేదో అర్థం కావడం లేదని ప్రశ్నించారు. వామపక్షాలు చేపట్టిన దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మరొక అధికార ప్రతినిధి రఫీ, టిఎన్‌టియుసి రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు మాట్లాడుతూ.. అర్ధరాత్రి సమయంలో పోలీసులు దౌర్జన్యంగా నిరాహార దీక్షా శిబిరంపై పడి కూల్చివేయడం ఏమి ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని అడగడం ప్రజాస్వామ్యమని, అడిగితేనే గొంతు నులిమేస్తామనడం అప్రజాస్వామికమని, జగన్‌ అనుసరిస్తున్న పోకడ పూర్తి నియంతృత్వంగా ఉందని అన్నారు. బొలిశెట్టి వంశీకృష్ణ మాట్లాడుతూ.. సలహాదారులకు రూ.లక్షలు ఇస్తున్న ప్రభుత్వం మూడువేలు పెంచడానికి ఎందుకు సంశయిస్తుందో అర్థం కావడం లేదని అన్నారు.

➡️