16 మందితో లెఫ్ట్‌ ఫ్రంట్‌ తొలి జాబితా

  •  అందులో సిపిఎం 13, సిపిఐ 1, ఫార్వర్డ్‌ బ్లాక్‌ 1, ఆర్‌ఎస్‌పి 1

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్‌ ఫ్రంట్‌ పశ్చిమ బెంగాల్‌లోని 16 లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. సీట్లు సర్దుబాటుపై కాంగ్రెస్‌తో చర్చలు జరుగుతున్నాయని లెఫ్ట్‌ ఫ్రంట్‌ చైర్మన్‌ బిమన్‌ బోస్‌ అన్నారు. గురువారం కలకత్తాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వామపక్ష కూటమి నాయకులతో కలిసి బిమన్‌ బోస్‌ మాట్లాడారు. 16 మంది అభ్యర్థులలో 14 మంది కొత్తవారని, యువకులని పేర్కొన్నారు. ”మేము 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాం. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు తమ హైకమాండ్‌తో మాట్లాడటానికి ప్రస్తుతం న్యూఢిల్లీలో ఉన్నారు. కాబట్టి, వారు తిరిగి వస్తే, ఆపై చర్చిస్తాం ఏమి జరుగుతుందో చూద్దాం” అని బోస్‌ అన్నారు. ఈ నెల 16న లెఫ్ట్‌ ఫ్రంట్‌ లో భాగస్వామ్య పార్టీలైన సిపిఎం, సిపిఐ, ఫార్వర్డ్‌ బ్లాక్‌, ఆర్‌ఎస్‌పిల మధ్య మళ్లీ చర్చలు జరుపుతామని చెప్పారు. జాబితా ప్రకారం సృజన్‌ భట్టాచార్య (జాదవ్‌పూర్‌), దీప్సితా ధర్‌ (సెరాంపూర్‌), దేబ్రాజ్‌ బర్మన్‌ (జల్పాయిగురి), మోనోదీప్‌ ఘోష్‌ (హుగ్లీ), నీలాంజన్‌ దాస్‌గుప్తా (బంకురా), శీతల్‌ కైబర్తా (బిష్ణుపూర్‌), నిరబ్‌ ఖాన్‌ (బుర్ద్వాన్‌-పుర్బా) సిపిఎం తరపున పోటీ చేయనున్నారు. కోల్‌కతా సౌత్‌ నుంచి సైరా షా హలీమ్‌, డమ్‌ డమ్‌ నుంచి సుజన్‌ చక్రవర్తి, కలకత్తా హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయవాదులు సయన్‌ బెనర్జీని తమ్లుక్‌, సబ్యసాచి ఛటర్జీని హౌరా నుండి అభ్యర్థులుగా బరిలో దింపింది. జమూరియా మాజీ ఎమ్మెల్యే జహనారా ఖాన్‌కు అసన్‌సోల్‌ నుంచి బరిలో దింపింది. సిపిఎంకి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఎం సాదీ కృష్ణానగర్‌ నుంచి పోటీ చేయనున్నారు. సిపిఐ నుంచి మిడ్నాపూర్‌ అభ్యర్థిగా విప్లవ్‌ భట్టా, కూచ్‌బెహార్‌ నుంచి ఫార్వర్డ్‌ బ్లాక్‌కు చెందిన నితీష్‌ చంద్రరారు, బలూర్‌ఘాట్‌ నుంచి ఆర్‌ఎస్‌పి నేత జోరుదేవ్‌ సిద్ధాంతను బరిలోకి దింపాయి.

➡️