ఉద్యోగం వదిలి ఉద్యమ బాటలోకి

Apr 22,2024 00:48

ప్రజాశక్తి – మంగళగిరి : సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతోనే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చానని ఇండియా బ్లాక్‌ తరుపున మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి జొన్న శివశంకరరావు అన్నారు. సోమవారం నామినేషన్‌ దాఖలు చేయేనున్న ఆయన ఆదివారం ప్రజాశక్తితో మాట్లాడారు. పేదరైతు కుటుంబంలో పుట్టిన తాను చదువుకునే రోజుల్లో విద్యార్థి రాజకీయాల్లోనూ చురుగ్గా పని చేశానన్నారు. 1981లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న తాను కమ్యూనిస్టు నేతల ప్రసంగాలకు విని తన దృక్పథాన్ని మార్చుకున్నానని, ఉద్యోగం వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చి కమ్యూనిస్టుగా మారానని అన్నారు. దళితులపై జరుగుతున్న అణిచివేతలను, బలహీన వర్గాలపై జరుగుతున్న అత్యాచారాలను చూసి వాటిని ప్రతిఘటించాలని అనుకున్నట్లు చెప్పారు. ఉండవల్లిలో అన్నదమ్ములు లాగా కలిసిమలిసి జీవించాల్సిన జనాలు కులాల వారీగా చీలిపోయి కొట్లాడుకుంటున్న నేపథ్యంలో వారిలో మార్పు తేవడానికి నడుం బిగించాలని అనుకున్నానని తెలిపారు. గ్రామంలో అభ్యుదయ భావాలున్న యువకుల్ని కూడగట్టి యువజన సంఘంలో పనిచేస్తూ 1981లో జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో విజయం సాధించానని, సర్పంచ్‌గా ఉన్న సమయంలో దళితవాడల్లో స్కూల్‌ భవనం నిర్మించామని తెలిపారు. రజకులకు దోబీఖానాలు నిర్మించామన్నారు. వీధివీధినా విద్యుత్‌ స్తంభాలు వేయించి విద్యుత్‌ కాంతులు తెచ్చామన్నారు. గ్రామంలో మట్టి రోడ్లను సిమెంట్‌ రోడ్లుగా తీర్చిదిద్దామని, ఆ విధంగా 20 ఏళ్లు (2001 వరకు) సర్పంచ్‌గా పనిచేశానని తెలిపారు.కొండవీటి వాగు ముంపుతో పంటలు కోల్పోయి నష్టపోతున్న రైతులు కోసం యువకుల శ్రమదానంతో వాగు పూడిక తీయించి పంట పొలాలకు వెళ్లే రైతుల కోసం వంతెన నిర్మించామన్నారు. గుంటూరు ఛానల్‌ పేరుకుపోయిన తూటికాడ తొలగించాలని ఆందోళన చేసి తొలగింజేశామన్నారు. తాడేపల్లి మండలంలో ప్రభుత్వ భూముల్లో ఇళ్లేసుకుని నివాసముంటున్న పేదలకు ఇళ్ల పట్టాల కోసం దశలవారీగా ఆందోళనలు చేశామని, రాజధాని ప్రాంతంలో భూసేకరణ చట్టం ప్రకారం అమరావతి రాజధానికి భూములు సేకరించాలని ఉద్యమించామని గుర్తు చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో వివిధ రకాల ప్రభుత్వ భూముల్లో దీర్ఘకాలంగా నివాసం ఉంటున్న పేదల ఇళ్ల పట్టాల కోసం పోరాడుతున్నామన్నారు. పెదవడ్లపూడి హై లెవెల్‌ ఛానల్‌ నిర్మాణం పూర్తి చేసి 25 వేల ఎకరాలకు సాగునీరు సాధన కోసం ఉద్యమించామన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా ఉండాలని ఆందోళన చేశాన్నారు. నియోజకవర్గంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రెయినేజీ వ్యవస్థ, రోడ్ల నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందనిన్నారు. నియోజవర్గంలో పేదలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ఉద్యమిస్తున్నామని చెప్పారు. మంగళగిరి – తాడేపల్లి నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత ఆస్తి పన్ను భారీగా పెంచారని, ఈ పన్నులు తగ్గించాలని, చెత్తపన్నును రద్దు చేయాలని అన్నారు. వీటన్నింటిపైనా ఇప్పటికే సిపిఎం, ప్రజా సంఘాలుగా అనేక ఆందోళనలు, ఉద్యమాలు బహుముఖ రూపాల్లో చేశామని చెప్పారు. ప్రజాపోరాటాల క్రమంలో అనేక నిర్బంధాలకూ గురయ్యామని, ఆరు నెలల పాటు రహస్య జీవితం, మూడు నెలల జైలు జీవితం గడిపానని తెలిపారు. శాసన సభకు ఎన్నికవడం ద్వారా చట్టసభల్లోనూ పేదల పక్షాన పోరాడడానికి, సమస్యలను పరిష్కరించడానికి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పారు.

➡️