ప్రభుత్వ కొలువులు వదిలి

Apr 9,2024 21:36

ప్రజాశక్తి – పాలకొండ : పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారిలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులే. పాలకొండ నియోజకవర్గం ఎస్‌సి రిజర్వడ్‌ నియోజకవర్గంగా ఉన్నప్పటి నుంచి నేటివరకు అనేక మంది ఉద్యోగాలు వదిలి శాసనసభలోకి అడుగుపెట్టారు. 2009లో నియోజకవర్గ పునర్జీవనమైన తర్వాత కూడా ఉద్యోగులే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 1983 ఎన్నికల్లో టిడిపి తరుపున గెలిచిన ఎమ్మెల్యే గోనెపాటి శ్యామలరావు ఆర్‌అండ్‌బి డిపార్ట్మెంటులో వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసి, ఉద్యోగాన్ని వదిలి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 1986లో పిజె అమృత కుమారి ఇరిగేషన్‌ శాఖలో ఉద్యోగం చేసి, రాజీనామా చేసి, కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1996లో కూడా ఇండిపెండెంటుగా పోటీ చేసి విజయం సాధించారు. బ్యాంక్‌ ఉద్యోగాన్ని వదిలుకొని తలే భద్రయ్య రాజకీయాల్లోకి వచ్చి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో పంచాయతీరాజ్‌ శాఖలో డ్రాఫ్ట్‌ మాన్‌గా పని చేసిన నిమ్మక సుగ్రీవులు ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2019 ఎన్నికలలో వైసిపి తరుపున ఎమ్మెల్యేగా ఉన్న విశ్వాసరాయి కళావతి స్టేట్‌ బ్యాంక్‌ ఉద్యోగం వదులుకుని రాజకీయాల్లోకి చేరారు.

➡️