బిజెపి నుండి రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం- ఇండియా వేదిక నాయకులు

Apr 14,2024 20:45 #Dharna, #Leaders of India Vedika

ప్రజాశక్తి-బాపట్ల:అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలైన ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, సోషలిజం వంటి అంశాల్ని కాపాడుకుంటామని ఇండియా వేదిక నాయకులు స్పష్టం చేశారు. కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను బిజెపి విధానాలను నిరసిస్తూ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం కార్యక్రమం చేపట్టారు. ముందుగా బాపట్ల పట్టణం రైల్వేస్టేషన్‌ వద్దనున్న అంబేద్కర్‌ విగ్రహానికి కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ, సమాజ్‌ వాది, ఆప్‌, విసికె పార్టీల నేతలు నివాళులర్పించారు. సమాజ్‌ వాది పార్టీ జిల్లా అధ్యక్షులు మేధా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్‌ గంగయ్య మాట్లాడారు. కేంద్రంలో మోడీ పాలనలో ప్రజాస్వామ్యానికి అర్థం మారిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలను కట్టడి చేయడానికి బిజెపి ప్రభుత్వం పూనుకుందని, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టిందని, కాంగ్రెస్‌ పార్టీ, ప్రతిపక్ష నాయకులకు ఇడి నోటీసులు జారీ చేసి.. ఏ క్షణాన్నైనా అరెస్టు చేస్తామనే పద్ధతుల్లో ఉందని పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని గద్దె దించేందుకు మతోన్మాద శక్తులను దూరంగా తరిమికొట్టే దిశగా ఇండియా వేదిక ఏర్పడిందన్నారు. బాపట్ల పార్లమెంటు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు గంటా అంజిబాబు మాట్లాడుతూ మతాల మధ్య చిచ్చు పెడుతూ దేశంలో మత కల్లోలం సృష్టించే బిజెపి మతోన్మాద శక్తులను ఈ ఎన్నికల్లో భూస్థాపితం చేయాలని కోరారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జెబి శ్రీధర్‌ మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గనని మతోన్మాద శక్తులను రాబోయే సార్వత్రిక ఎన్నికలలో చిత్తుగా ఓడించి ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించుకొని దేశాన్ని కాపాడుకోవాలని కోరారు.

➡️