జమిలి ఎన్నికలపై ఈ వారంలోనే లా కమిషన్‌ నివేదిక ?

Law commission report on Jamili election this week?

న్యూఢిల్లీ : దేశంలో సార్వత్రిక ఎన్నికలు హంగామా ఇప్పటికే ప్రారంభమయింది. కొన్ని పార్టీలు అభ్యర్థుల జాబితాలను కూడా ప్రకటించాయి. మ్యానిఫెస్టోలు, అజెండాలు కూడా సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు ప్రకటించడానికి ముందే జమిలి ఎన్నికలపై 22వ లా కమిషన్‌ తన తుది నివేదికను ఈ వారంలోనే న్యాయ శాఖకు సమర్పించే అవకాశాలు కన్పిస్తున్నాయి. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంలో సాధ్యాసాధ్యాలపై లా కమిషన్‌ తన నివేదికను సమర్పించాల్సి ఉంది. ఈ నెల మూడో వారంలో ఎన్నికల కమిషన్‌ షెడ్యూలును ప్రకటించవచ్చు. ఈ నేపథ్యంలో దానికి ముందే…ఈ వారంలోనే లా కమిషన్‌ నివేదికను సమర్పిస్తుందని కేంద్ర న్యాయ శాఖ వర్గాలు తెలిపాయి.

2029లో దేశంలో పూర్తి స్థాయిలో జమిలి ఎన్నికల నిర్వహణ కోసం జస్టిస్‌ రితురాజ్‌ అవస్థి నేతృత్వంలోని లా కమిషన్‌ పలు రాజ్యాంగ సవరణలు సూచించింది. 1951వ సంవత్సరం నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయడంతో పాటు జమిలి ఎన్నికల నిర్వహణ, ఉమ్మడి ఓటర్ల జాబితా తయారీ కోసం రాజ్యాంగంలో నూతన ఛాప్టర్‌ను రూపొందించాలని సిఫార్సు చేసింది. లా కమిషన్‌ చేసిన పలు సిఫార్సులను మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఆమోదించినట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణకు కూడా సుముఖత వ్యక్తం చేసిందని సమాచారం. రాజ్యాంగ సవరణ ద్వారా పార్ట్‌15-ఏ పేరిట కొత్త ఛాప్టర్‌ను ప్రవేశపెట్టాలని లా కమిషన్‌ సూచించింది. ప్రస్తుతం రాజ్యాంగంలోని పార్ట్‌ 15లో ఎన్నికల నిర్వహణ గురించి వివరించారు. నూతన ఛాప్టర్‌లో మూడంచెల జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ‘సమకాలీకరించిన ఎన్నికలు’, ‘జమిలి ఎన్నికల స్థిరత్వం’, ‘ఉమ్మడి ఓటర్ల జాబితా’ అనే అంశాలకు సంబంధించిన వివరాలను ఈ ఛాప్టర్‌లో పొందుపరుస్తారు.

➡️