ఈడి కార్యాలయానికి లాలూ యాదవ్‌

పాట్నా   :   ఆర్‌జెడి అధినేత, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను సోమవారం  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) విచారించింది. ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ కేసులో ఆయనను ప్రశ్నించింది. పాట్నాలో విచారణ సందర్భంగా లాలూ వెంట ఆయన కూతురు మీసా భారతి కూడా ఉన్నారు. ఈ కేసులో ఆమె కూడా నిందితురాలిగా ఉన్నారు. మహా కూటమి సంకీర్ణ సర్కారును.. నితీశ్‌ నేతృత్వంలోని జెడియు వీడి బిజెపితో చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇది జరిగిన తర్వాత రోజే ఇడి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను విచారించటం గమనార్హం. 2004 నుంచి 2009 మధ్య యుపిఎ -1 హయాంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పని చేసిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌.. ఉద్యోగార్థుల నుంచి భూములు తీసుకొని రైల్వేలో వారికి ఉద్యోగాలు కల్పించారని దర్యాప్తు సంస్థల ఆరోపణ. ఈ కేసులో ఇడి ఢిల్లీలోని మనీలాండరింగ్‌ ప్రత్యేక కోర్టు ముందు చార్జీషీటును కూడా దాఖలు చేసింది. ఇందులో లాలూప్రసాద్‌ యాదవ్‌, ఆయన భార్య రబ్రీదేవీ, ఇద్దరు కూతుర్ల పేర్లను కూడా చేర్చింది.

స్పందించిన ఆర్‌జెడి

లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ఇడిని కేంద్రం ఉపయోగించుకుంటున్నదని ఆర్‌జెడి విమర్శించింది. ”ఇవి ఇడి సమన్లు కాదు, బిజెపి సమన్లు. 2024 వరకు ఇలాగే ఉంటుంది. అప్పటి వరకు దయచేసి దీనిని ఇడి సమన్లు అనద్దు. మేమెందుకు భయపడాలి” అని ఆర్‌జెడి ఎంపీ మనోజ్‌ ఝా అన్నారు.

‘బిజెపితో లేని వారికి గ్రీటింగ్‌ కార్డు వెళ్తుంది’

ఇడి అధికారుల తీరుపై లాలూ ఇద్దరు కూతుర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థ అన్ని ప్రశ్నలకు తమ కుటుంబ సభ్యులు సమాధానాలు చెప్పారని మీసా భారతి అన్నారు. బిజెపితో ఉండనివారు, వారి వైపు (బిజెపి) వెళ్లని వారికి గ్రీటింగ్‌ కార్డు అందుతుందని ఇడి కార్యాలయం ముందు ఆమె అన్నారు. అనారోగ్యంతో ఉన్న తన తండ్రితో ఇడి కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. లాలూ ఆరోగ్యంగా లేరన్న విషయం దేశవ్యాప్తంగా తెలుసనీ, ఆయనకు కిడ్నీ ఆపరేషన్‌ జరిగిందనీ, అనేక రోగాలతో, ముఖ్యంగా వయో భారంతో ఆయన సతమతమవుతున్నారని తెలిపారు. ఇడి అధికారుల తీరు అమానవీయంగా ఉన్నదనీ, అమానుషమని లాలూ మరో కూతురు రోహిణీ ఆచార్య అన్నారు.

➡️