జెడియు జాతీయ అధ్యక్ష పదవికి లలన్‌ సింగ్‌ రాజీనామా ..!

Dec 26,2023 14:42 #Bihar, #JDU chief, #Nitish Kumar

పాట్నా   :    బీహార్‌లో జెడి(యు) జాతీయ అధ్యక్షుడి పదవికి లలన్‌ సింగ్‌ రాజీనామా చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డిసెంబర్‌ 29న ఢిల్లీలో జరిగే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ అంశంపై బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ నిర్ణయం తీసుకోనున్నట్లు మంగళవారం ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ యాదవ్‌, తేజస్వి యాదవ్‌లతో లలన్‌ సింగ్‌ సన్నిహితంగా వుండడం నచ్చలేదని సమాచారం. ఇండియా ఫోరంలో పార్టీ సరైన స్టాండ్‌ను ప్రదర్శించలేదని కూడా లలన్‌ సింగ్‌ పట్ల నితీష్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. లాలూతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే లలన్‌ సింగ్‌ను ఆ పదవి నుంచి నితీష్‌ తొలగించారని బిజెపి ఎంపి, మాజీ డిప్యూటి సిఎం సుశీల్‌ కుమార్‌ మోడీ కూడా ఇటీవల ప్రకటించడం గమనార్హం.

డిసెంబర్‌ 29న నిర్వహించే సమావేశంలో నితీష్‌ కుమార్‌ స్వయంగా పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించవచ్చు లేదా అధ్యక్ష పదవికి కొత్త నాయకుడిని నియమించవచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే లలన్‌ సింగ్‌ రాజీనామాను నితీష్‌ కుమార్‌ తిరస్కరించే అవకాశం కూడా ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో అధ్యక్షుడిగా కొత్తవారిని తీసుకుంటే కార్యకర్తల్లో గందరగోళం ఏర్పడుతుందని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.   లలన్‌ సింగ్‌ రాజీనామా నిర్ణయాన్ని జెడి (యు) పార్టీ ఖండించింది. లలన్‌ సింగ్‌ తన పదవిలో కొనసాగుతున్నారని, ఆయన రాజీనామా చేయలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

➡️