‘లక్షద్వీప్‌’ పర్యాటకాభివృద్ధి ఉత్తుత్తిదే !

  • విదేశీ చిత్రాలతో బిజెపి పెద్దల బడాయి ప్రచారం
  • ‘ఆల్ట్‌న్యూస్‌’ పరిశోధనలో బయటపడ్డ బండారం

న్యూఢిల్లీ : ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీప్‌లో పర్యటించి, అక్కడి చిత్రాలను సామాజిక మాధ్యమాలలో షేర్‌ చేసిన తర్వాత ఆ దీవులకు విపరీతమైన ప్రచారం లభించింది. అనేక మంది లక్షదీవులను మాల్దీవులతో పోల్చడంతో వివాదం కూడా చెలరేగింది. మోడీ లక్షద్వీప్‌ పర్యటన అనంతరం ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంతో ఇప్పుడు రెండు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే పలువురు బిజెపి అగ్ర నాయకులు, కేంద్ర మంత్రులు, సంఫ్‌ు పరివార్‌ ప్రముఖులు లక్షదీవుల అందాలు చూడతరమా! అంటూ సామాజిక మాధ్యమాలలో ప్రచారం గుప్పిస్తున్నారు. మోడీ సర్కార్‌ కృషితో లక్షదీప్‌ కొత్త సొబగులు అద్దుకుందంటూ, పర్యాటకాభివృద్ధి పరుగులు పెడుతోందంటూ గొప్పగా ప్రచారం చేస్తున్నారు. అండమాన్‌ నికోబార్‌ దీవులు, పోర్ట్‌ బ్లెయిర్‌ చిత్రాలుగా సామాజిక మాధ్యమాల్లో కొన్నింటిని షేర్‌ చేశారు. కానీ అవన్నీ మన దేశంలోని పర్యాటక స్థలాల చిత్రాలేనా అనే విషయంపై ‘ఆల్ట్‌ న్యూస్‌’ పోర్టల్‌ కూపీ లాగగా బండారం బయటపడింది.

అవన్నీ విదేశీ చిత్రాలే

లక్షదీవుల ఫొటోలు అని చెబుతూ కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు రెండు చిత్రాలను షేర్‌ చేసి, ఆ తర్వాత వాటిని తొలగించారు. నటుడు రణవీర్‌ సింగ్‌ కూడా ఓ ఫొటోను షేర్‌ చేసి, దేశంలో బీచ్‌ ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పాలంటూ నెటిజన్లను కోరారు. అయితే ఆయన కూడా ఆ తర్వాత ఆ ఫొటోను తొలగించారు. బిజెపి ఎంపీ రవి కిషన్‌, క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా కొన్ని సందర్శక స్థలాల ఫొటోలను షేర్‌ చేశారు. తామూ తక్కువ తినలేదన్నట్లు మితవాది అరుణ్‌ పుడుర్‌, బిజెపి నాయకుడు తాజీందర్‌ బగ్గా కూడా అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీప్‌, పోర్ట్‌ బ్లెయిర్‌ బీచ్‌ చిత్రాలను పోస్ట్‌ చేశారు. శ్రీ లక్షద్వీప్‌ చిత్రాలుగా కిరణ్‌ రిజిజు, అరుణ్‌ పుడుర్‌ చెబుతున్నవి అలామీ స్టాక్‌ వెబ్‌సైట్‌్‌లో ఉన్న ఫొటోలు. అవి ఫ్రాన్స్‌ పొలినేసియాలోని బోరా బోరా దీవుల నుండి తీసినవి. డ్రీమ్స్‌టైమ్‌ వెబ్‌సైట్‌లో కూడా ఈ ఫొటోలు ఉన్నాయి. అవి ఫ్రాన్స్‌ పొలినేసియా చిత్రాలంటూ కింద రాశారు కూడా. ఇక అరుణ్‌ పుడుర్‌ షేర్‌ చేసిన మరో ఫొటోను గూగుల్‌లో ‘రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌’ విభాగంలో వెతకగా అది షట్టర్‌స్టాక్‌ వెబ్‌సైట్‌లోనూ, అనేక స్టాక్‌ వెబ్‌సైట్లలోనూ దర్శనమిచ్చింది. వాస్తవానికి అది థాయిలాండ్‌లోని తోన్సారు బీచ్‌. శ్రీ రణవీర్‌ సింగ్‌ షేర్‌ చేసిన ఫొటో విషయానికి వస్తే దానిని షట్టర్‌స్టాక్‌ వెబ్‌సైట్‌ నుండి అప్‌లోడ్‌ చేసినట్లు తేలింది. ఆ ఫొటో మాల్దీవులకు చెందినది. మరో చిత్రాన్ని రవి కిషన్‌, కిరణ్‌ రిజిజు, అరుణ్‌ పుడుర్‌ షేర్‌ చేశారు. ఆ చిత్రం 2013లో టాప్‌ డ్రీమర్‌ అనే మ్యాగజైన్‌లో ప్రచురితమైంది. ఆ ఫొటో కూడా మాల్దీవులకు చెందినదిగా తెలిపారు. ఈ ఫొటోనే 2012 మార్చి 21న మాల్దీవన్‌ అనే ఫేస్‌బుక్‌ పేజీలో కన్పించింది. అదే ప్రదేశంలో వేరే కోణం నుండి మరో చిత్రాన్ని 2012 ఏప్రిల్‌ 26న తీశారు. ఇది ఫ్లికర్‌ వెబ్‌సైట్‌లో కూడా కన్పించింది. 2011 నవంబర్‌ 14న ఈ చిత్రాన్ని తీశారని వెబ్‌సైట్‌ తెలిపింది. శ్రీ వీరేంద్ర సెహ్వాగ్‌ షేర్‌ చేసిన చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లోని ట్రావెల్‌ పేజీలో అప్‌లోడ్‌ చేశారు. ఫ్రెంచ్‌ పాలినేసిస్‌లోని బోరా బోరాలో ఈ చిత్రాన్ని తీశారు. అరుణ్‌ పుడుర్‌ షేర్‌ చేసిన మరో చిత్రం అబోడ్‌ స్టాక్‌ వెబ్‌సైట్‌లోనిది. ఇది థాయిలాండ్‌లోని ఫుకెట్‌ ప్రాంతానికి చెందిన ఫొటో. అరుణ్‌ పుడుర్‌ షేర్‌ చేసిన ఇంకో చిత్రం పింటరెస్ట్‌ నుండి తీసుకున్నది. ఈ చిత్రం కూడా థాయిలాండ్‌లోనిదే. బిజెపి నాయకుడు తాజిందర్‌ బగ్గా ఓ ఫొటోను షేర్‌ చేశారు. దీనిని స్టాక్‌ ఇమేజ్‌ వెబ్‌సైట్‌ షట్టర్‌స్టాక్‌ నుండి అప్‌లోడ్‌ చేశారని తేలింది. ఇది కూడా థాయిలాండ్‌లోని కో లైప్‌ బీచ్‌ ఫొటోయే. అరుణ్‌ పుడుర్‌ షేర్‌ చేసిన మరో ఫొటో అలామీ వెబ్‌సైట్‌ నుండి తీసుకున్నది. దీనిని 2017 మే 23న ఓ కంట్రిబ్యూటర్‌ ఆ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఈ ఫొటో ఇండోనేషియాలోని లెంబాన్‌గన్‌ దీవుల సమీపంలో హిందూ మహా సముద్రంలోనిదని తేలింది.

➡️