మహిళలూ ఇవి తినండి …

Dec 18,2023 10:38 #feature

ఇంట్లో, ఆఫీసుల్లో ఎడతెగని పని ఒత్తిడితో సతమతమయ్యే మహిళలు క్రమం తప్పకుండా అవసరమైన విటమిన్లు లభించే పోషకాహారం తీసుకోవాలి. హిమోగ్లోబిన్‌ ఏర్పడటానికి ఐరన్‌, ఎముకల నిర్మాణానికి కాల్షియం, రోగనిరోధక శక్తికి జింక్‌ మొదలైనవి శరీరానికి చాలా అవసరం. మరి అవన్నీ అందాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందామా !

‘బి’ విటమిన్లు : 40 ఏళ్లు వయస్సులో పడుతున్న ఆడవాళ్లకు రోగనిరోధక శక్తి తగ్గుతూ వుంటుంది. నీరసం, నిస్సత్తువకు లోనవుతారు. కాబట్టి బి విటమిన్లు అధికంగా లభించే ముదురు ఆకుపచ్చ ఆకుకూరలు, కూరగాయలు, పాలు, చేపలను తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి.

అయోడిన్‌ : అయోడిన్‌ అధికంగా ఉండే దానిమ్మ, పెరుగు, స్ట్రాబెర్రీ, బంగాళదుంప వంటివి తినాలి. చేపలు, రొయ్యలు, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు, మాంసం ద్వారా కూడా అయోడిన్‌ను పొందవచ్చు. నీళ్లు ఎక్కువగా తాగాలి. థైరాయిడ్‌ సమస్య ఉన్నట్లయితే.. తప్పకుండా వైద్యులు, ఆహార నిపుణులు సూచించే ఆహారాన్ని మాత్రమే డైట్‌గా తీసుకోవాలి.

ఫోలేట్‌ : దీన్ని ఫోలిక్‌ యాసిడ్‌ అని కూడా అంటారు. కణాల అభివృద్ధికి, డిఎన్‌ఎ, ఆర్‌ఎన్‌ఎ, ఏర్పడటానికి ఫోలేట్‌ అవసరం అవుతుంది. 25 ఏళ్లు పైబడిన వారు సిట్రస్‌ పండ్లు, కిడ్నీ బీన్స్‌, గుడ్లు వంటి ఆహారాలను క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి.

కాల్షియం, విటమిన్‌ డి : వృద్ధాప్యంలో ఎముకల క్షీణత సాధారణం. అందుకే 40 ఏళ్లు పైబడిన మహిళలు ఎముకల్లో పగుళ్లు, గాయాల బారిన పడకుండా ఉండాలంటే.. రోజూ 1200 మి.గ్రా. కాల్షియం, 600 మి.గ్రా. డి విటమిన్‌ అవసరం అవుతుంది. పాలు, గుడ్డులో పుష్కలంగా ఇవి లభిస్తాయి. ఎముకల బలానికి, కండరాలు, నాడీ వ్యవస్థ అభివృద్ధికి కాల్షియం అవసరం. యుక్త వయస్సులోని ఆడపిల్లలకు ఎముక సాంద్రత పెరగాలంటే, కాల్షియం లభించే ఆహార పదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే ఎముకల అభివృద్ధిలో లోపాలు ఏర్పడతాయి. పాల ఉత్పత్తులు, సోయా, చేపలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. సీ ఫుడ్‌, పప్పులు, తృణధాన్యాలైన రాగులు, గోధుమ, జొన్నల్లో విటమిన్‌ డి ఉంటుంది.

ఐరన్‌ : పీరియడ్స్‌ ప్రారంభమయ్యే వయసుకు వచ్చేనాటికి చాలామంది ఐరన్‌ లోపంతో బాధపడుతుంటారు. ఐరన్‌ లోపం ఉన్న మహిళలు బలహీనంగా ఉంటారు. ఇది ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది. అందుకే మహిళ శరీరానికి రోజుకు 18 మి.గ్రా ఐరన్‌ అందాలి. మాంసం, చేపలు, బచ్చలికూర, గుమ్మడి గింజలు, దానిమ్మలో ఇది పుష్కలంగా ఉంటుంది.

➡️