గాజాలో కాల్పుల విరమణకు లేబర్‌ పార్టీ సానుకూలత

Feb 22,2024 10:23 #gaja, #hamsa
  •  కాల్పుల విరమణకు అంగీకరించకుంటే ఎన్నికల్లో తిరస్కరిస్తామన్న నినాదాలు, నిరసనల ఫలితం

లండన్‌: పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ ఊచకోతను అధికార కన్సర్వేటివ్స్‌తో కలసి గుడ్డిగా వెనకేసుకొచ్చిన స్టార్మర్‌ నేతృత్వంలోని బ్రిటన్‌ లేబర్‌ పార్టీ తన వైఖరిని ఇప్పుడు సవరించుకుంది. గాజాలో ‘మానవతా కాల్పుల విరమణ’ తక్షణమే పాటించాలని కోరింది. గాజాలో కాల్పుల విరమణకు సంబంధించిన తీర్మానం పార్లమెంటులో చర్చకు రావడానికి ముందే ఈ మేరకు ఒక సవరణను లేబర్‌ పార్టీ ప్రతిపాదించింది. జెరిమి కార్బిన్‌ వంటి లెఫ్ట్‌ అనుకూల నేతలు, ఎంపీలు కొందరు లేబర్‌ పార్టీ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. అయినా స్టార్మర్‌ మొండిగా ఇజ్రాయిల్‌ అనుకూల వైఖరిని కొనసాగిస్తూ వచ్చారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాల్పుల విరమణకు మద్దతు ఇవ్వని పార్టీలను వచ్చే ఎన్నికల్లో ఓడిస్తాం అంటూ అతి పెద్ద నిరసన ర్యాలీ ఇటీవల లండన్‌లో జరిగిన నేపధ్యంలో లేబరు పార్టీ తన వైఖరిని మార్చుకోక తప్పలేదు. అలాగే పార్టీలోపల నుంచి కూడా పాలస్తీనాకు సంఘీభావం వ్యక్తమవుతోంది. ఇజ్రాయిల్‌ తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని, అన్ని పక్షాలు పోరాటాన్ని ఆపు చేయాలని కోరుతున్న తీర్మానానికి బ్రిటన్‌ ప్రతినిధుల సభలో లేబర్‌ పార్టీ మద్దతు పలకనుంది. ఇంతకుముందు గాజా కాల్పుల విరమణపై జరిగిన ఓటింగ్‌కు లేబర్‌ ఎంపీలు నాలుగోవంతు మంది కన్నా ఎక్కువమందే గైర్హాజరయ్యారు. దీంతో వారికి వారి నియోజకవర్గాల్లోని ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. వారిలో కొందరికి ఎన్నికల్లో పరాజయం భయం కూడా పట్టుకుంది. కాగా ఆ సవరణను ‘అస్పష్టమైన, అసందిగ్ధమైన పదాలు’ గా వామపక్ష ఎంపి దియానె అబోట్‌ వ్యాఖ్యానించారు.

➡️