‘జమిలి’కి తలూపారు

  • రాష్ట్రపతికి నివేదిక అందజేసిన కోవింద్‌ కమిటీ
  • 32 పార్టీలు మద్దతు, 15 పార్టీలు వ్యతిరేకం
  • రాజ్యాంగంలో ఐదు అధికరణలకు సవరణలు
  • తొలుత లోక్‌సభ, అసెంబ్లీలకు,ఆ తరువాత వంద రోజులకు స్థానిక సంస్థల ఎన్నికలకు సిఫార్సు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 2029లో దేశంలో జమిలి ఎన్నికలు సాధ్యమేనంటూ రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటి ప్రతిపాదించింది. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలని కమిటీ ఏకగ్రీవంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించింది. దేశంలో ఒకేసారి ఎన్నికలతో ఎన్నో ప్రయోజనాలున్నాయని కమిటీ పేర్కొంది. ఒకే దేశం -ఒకే ఎన్నిక (జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్య సాధ్యాల)పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ అధ్యాయనం పూర్తి అయింది. ఈ కమిటీ తుది నివేదికను గురువారం రాష్ట్రపతి భవన్‌ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రామ్‌నాథ్‌ కోవింద్‌తో సహా కమిటీ అందజేశారు. జమిలి ఎన్నికలపై విస్తృత సంప్రదింపులు, సమావేశాలు, అభిప్రాయ సేకరణ అనంతరం ఎనిమిది భాగాలుగా 18,626 పేజీల నివేదికను రూపొందించింది. దాదాపు 190 రోజుల పాటు ఈ అంశంపై కమిటీ అధ్యయనం జరిపింది. పలు రంగాల నిపుణులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. 47 రాజకీయ పార్టీలు దీనిపై తమ అభిప్రాయాలు తెలిపాయి. ఇందులో 32 జమిలికి మద్దతిచ్చాయి.
15 పార్టీలు వ్యతిరేకించాయి. నలుగురు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకకాల ఎన్నికలను నిర్ద్వంద్వంగా ఆమోదించారని నివేదిక పేర్కొంది. ప్రజల నుంచి కూడా కమిటీ సలహాలు, సూచనలు కోరగా.. 21,558 స్పందనలు వచ్చాయి. వీరిలో 80 శాతం మంది ఏకకాల ఎన్నికలను సమర్థించారు. ఇవన్నీ అధ్యయనం చేసిన అనంతరం కమిటీ నివేదిక రూపొందించింది. ఒకేసారి ఎన్నికల కోసం కోవింద్‌ కమిటీ నిర్దిష్ట సిఫార్సులు చేసింది.
కమిటీ ప్రతిపాదనలు
జమిలి ఎన్నికలకు కోవింద్‌ కమిటీ రెండంచెల విధానాన్ని సూచించింది. తొలుత లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో పోలింగ్‌ నిర్వహించాలని పేర్కొంది. ఆ తరువాత 100 రోజులకు మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికలు జరపాలని నివేదికలో తెలిపింది. ఇందుకోసం రాజ్యాంగంలో ఆర్టికల్‌ 83 (పార్లమెంట్‌ పదవీకాలం), ఆర్టికల్‌ 172 (రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం), పంచాయతీలు, మున్సిపాలిటీలలో ఏకకాల ఎన్నికల కోసం ఆర్టికల్‌ 324ఎ, ఒకే ఓటర్ల జాబితా, ఒకే ఓటర్ల ఫోటో గుర్తింపు కార్డు కోసం ఆర్టికల్‌ 325 వంటి రాజ్యాంగ సవరణ సహా కనీసం ఐదు ఆర్టికల్స్‌ ను సవరించాలని కమిటీ సూచించింది. ఈ సవరణలకు రాష్ట్రాల ఆమోదం అవసరం. ఇక, ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని తెలిపింది. ఒకవేళ హంగ్‌ ఏర్పడితే అప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరో అయిదేళ్లకు చెందిన తాజా ఎన్నికలను మళ్లీ నిర్వహించాల్సి ఉంటుందని కోవింద్‌ ప్యానెల్‌ రిపోర్టులో పేర్కొంది. తొలిసారి జరిగే జమిలీ ఎన్నికలకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల కాల పరిమితి లోక్‌సభ ఎన్నికల తేదీ నాటికే ముగుస్తుందని నివేదికలో తెలిపింది.
జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తు ప్లానింగ్‌ ఉండాలని, ఎన్నికలకు అవసరమైన యంత్ర పరికరాలు, సిబ్బంది, భద్రతా బలగాలను మోహరించాల్సి ఉంటుందని రిపోర్టులో పేర్కొన్నారు. సింగిల్‌ ఎన్నికల రోల్‌ను ఎన్నికల సంఘం తయారు చేయాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల అధికారులతో కలిసి లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలకు చెందిన ఓటరు ఐడీ కార్డులను రూపొందించాల్సి ఉంటుంది. జమిలీ ఎన్నికల నిర్వహణతో పారదర్శకత పెరుగుతుందని తెలిపింది. జమిలీతో పరిపాలనా వ్యవస్థ వృద్ధి చెందుతుందని రిపోర్టులో పేర్కొంది. కమిటీ ఇచ్చిన సిఫార్సుల అమలును పరిశీలించే ఒక ఇంప్లిమెంటేషన్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేయవచ్చని కూడా కమిటీ సిఫార్సు చేసింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత మొదటి సమావేశ తేదీని అపాయింటెడ్‌ తేదీగా పేర్కొంటూ రాష్ట్రపతి నోటిఫికేషన్‌ జారీ చేయాలని కమిటీ ప్రతిపాదించింది. నివేదిక అందజేసిన వారిలో రామ్‌నాథ్‌ కోవింద్‌ తో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, డిపిఎపి నేత గులాం నబీ ఆజాద్‌, కేంద్రమంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ తదితరులు ఉన్నారు.
ఇది పూర్తిగా ఆచరణీయం కాదు: సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకరనారాయణన్‌
‘వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌’పై కమిటీ ఇచ్చిన నివేదక ఆచరణనీయం కాదని సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకరనారాయణన్‌ అన్నారు. ” నివేదికలో సూచించినట్లు వాటిని అమలు చేయవలసి వస్తే, మార్పు తీసుకురావడానికి ఆర్టికల్స్‌ చేర్చి, చొప్పించాలనుకుంటున్నారు. దానికి రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంది. 2/3వ మెజారిటీతో పాటు సగం రాష్ట్రాలు కూడా తమ అంగీకారాన్ని ఇవ్వాలి. కాబట్టి, ఇది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. వారు పదవీకాలాన్ని మాత్రమే చూశారని నేను భావిస్తున్నాను. వారు అన్నింటిని కూడా చూడాలి. అత్యవసర అధికారాలు, రాష్ట్రపతి అధికారాలు, రాష్ట్రపతి పాలన మొదలైన వాటితో సహా రాజ్యాంగంలోని నిబంధనలను మార్చాల్సిన అవసరం ఉంది. ఈ సమగ్రమైన కసరత్తు చేయాలి. ఆచరణాత్మకంగా లేకుండా చేస్తే, ఇది అర్ధవంతం కాదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గత 75 ఏళ్లలో ప్రభుత్వాలు ఎలా ఏర్పాడ్డాయో, పార్లమెంట్‌, శాసనసభలు ఎలా ఏర్పడ్డాయో మనం చూశాం. పరిష్కరించాల్సిన ప్రత్యేక సమస్య ఏదీ ఇందులో పేర్కొనలేదు. నా దృష్టిలో ఇది పూర్తిగా ఆచరణీయం కాదు. పూర్తిగా అనవసరం” అని అన్నారు.

➡️