కొల్లాంలో సినీ స్టార్‌ ముఖేష్‌ కుమార్‌

  • సిపిఎం అభ్యర్థిగా పోటీ
  • రెండు తడవలు ఎంఎల్‌ఎగా సేవ
  •  ప్రచారంలో అక్కున చేర్చుకుంటున్న ప్రజలు

సినిమాలు, టీవీ షోలు, స్థానిక ప్రత్యేక భాషా శైలితో కొల్లాం బ్రాండ్‌ అంబాసిడర్‌గా పేరు తెచ్చుకుంటున్న నటుడు ఎం. ముఖేష్‌ కుమార్‌. కళ, రాజకీయాలు రెండింటినీ మేళవించి ఫెర్మార్మ్‌ చేసి ‘కొల్లాం’ హీరోగా ఆయనకు పేరుంది. కొల్లాం ఎమ్మెల్యేగా రెండుసార్లు ఎన్నికైన ముఖేష్‌ కుమార్‌, స్టార్‌ స్థాయికి మించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మనసు గెలుచుకుని పార్లమెంట్‌ ఎన్నికల్లో బరిలో దిగారు. కొల్లాం లోక్‌సభ నియోజకవర్గానికి సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముఖేష్‌ను ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు.

రంగస్థలం నుంచి…
నాటక రచయిత ఒ. మాధవన్‌, రంగస్థల సినీ నటి విజయకుమారి దంపతులకు 1957 మార్చి 5న కొల్లాం పట్టణం ఈస్ట్‌ హౌస్‌లో ముఖేష్‌ జన్మించారు. తంగస్సేరీలోని ఇన్ఫాంటా జీసస్‌ స్కూల్‌లో చదివిన తరువాత కొల్లాంలోని ఎస్‌ఎన్‌ కాలేజీలో సైన్స్‌లో పట్టభద్రుడయ్యాడు. తిరువనంతపురం లా కాలేజీలో ఎల్‌ఎల్‌బి రెండో సంవత్సరం చదువుతున్న సమయంలో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ముఖేష్‌లోని కళాకారుడికి కొల్లాంలోని ఎస్‌ఎన్‌ కాలేజీలో చదువుతున్న సమయంలో మరిన్ని అవకాశాలు వచ్చాయి. ఏకపాత్రాభినయాలతో పలు నాటక ప్రదర్శనలిచ్చి కళాశాలకు హీరోగా నిలిచాడు. 1982లో ‘బెలూన్‌’ తో సినిమాల్లోకి ప్రవేశించారు. హీరోగా, రెండో హీరోగా 400కు పైగా చిత్రాల్లో నటించారు. ఏడు తమిళ సినిమాల్లో కూడా నటించాడు. టెలివిజన్‌ షోలతో మళయాళీల మనసులో స్థానం సంపాదించుకున్నారు. 2006లో, ప్రశాంత్‌ నారాయణన్‌, మోహన్‌లాల్‌తో ఛాయాముఖి అనే నాటకానికి దర్శకత్వం వహించారు. ఇది ముఖేష్‌కు ప్రసంశలను తెచ్చిపెట్టింది.

ప్రతిపక్షాల విమర్శలకు ఎదుర్కొని…
2016లో ఆయన సినీ ప్రపంచంలో స్టార్‌గా ఉన్న సమయంలో కొల్లాం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎల్‌డిఎఫ్‌ నుంచి సిపిఎం తరపున పోటీ చేశారు. సినీనటుడు ఎమ్మెల్యే అయితే నియోజకవర్గంలో కనిపించరంటూ ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. కొల్లాం ప్రజలు 17,611 ఓట్ల మెజారిటీతో ముఖేష్‌ను ఎన్నుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో 2021లోనూ ముఖేష్‌కు రెండో తడవ విజయం లభించింది. ముఖేష్‌ కథలు అనే పుస్తకాన్ని ప్రచురించారు. సంగీత నాటక అకాడమీ చైర్మన్‌గా కూడా పనిచేశారు.

జె.జగదీష్‌

➡️