దక్షిణ కొరియా వార్తలను ఖండించిన కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోదరి

ప్యొంగ్యాంగ్‌ :    తమ సరిహద్దుకు సమీపంలో ఫిరంగి కాల్పులు జరిపారన్న దక్షిణ కొరియా వార్తలను ఉత్తర కొరియా ఖండించింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోదరి ఈ వార్తలను తోసిపుచ్చారు. తమ సైన్యం ఆ ప్రాంతంలో ఒక్క షెల్‌ను కూడా కాల్చలేదని కిమ్‌ యో జోంగ్‌ అధికారిక ప్రకటనలో తెలిపారు. తమ సైన్యం 60 సార్లు కాల్పుల శబ్దాన్ని అనుకరించేలా పేలుడు పదార్థాలను పేల్చిందని, దక్షిణ కొరియా సైన్యం ప్రతిస్పందనను వీక్షిందని పేర్కొన్నారు. తాము ఊహించిన విధంగానే ఫలితం వచ్చిందని ఆమె అన్నారు. పేలుడు శబ్దాలను దక్షిణ కొరియా ఫిరంగి  కాల్పులుగా తప్పుగా అంచనావేశారు. తాము రెచ్చగొట్టామని, అసత్యవాదన చేశారని అన్నారు. భవిష్యత్తులో ఉత్తర కొరియాలో ఆకాశంలో ఉరుముల మెరుపుల శబ్దాన్ని కూడా కాల్పులగానే తప్పుగా అంచనా వేస్తుందని మండిపడ్డారు.

యోన్‌ప్యోంగ్‌ ద్వీపం సమీపంలో ఉత్తర కొరియా దళాలు 60కి పైగా ఫిరంగి రౌండ్‌లను ప్రయోగించినట్లు శనివారం దక్షిణ కొరియా ప్రకటించింది. 2018 ఒప్పందం ప్రకారం ప్రకటించిన బఫర్‌ జోన్‌లోనే షెల్స్‌ పడ్డాయని దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ప్రకటించారు. ఆ ముందు రోజు ఇరు దేశాలు వివాదాస్పద సముద్రసరిహద్దు సమీపంలోని అదే ప్రాంతంలో ప్రత్యక్షంగా సైనిక విన్యాసాలను ప్రదర్శించిన సంగతి తెలిసిందే.

➡️