మార్చి వరకూ ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు

Dec 9,2023 10:35 #Kharif

 

నిబంధనల్లేకుండా తడిసిన ధాన్యం సేకరణ

దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమా

పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ అరుణ్‌ కుమార్‌

ప్రజాశక్తి – పెదపాడు (ఏలూరు జిల్లా) : రాష్ట్రంలో ఖరీఫ్‌ ధాన్యాన్ని వచ్చే ఏడాది మార్చి నెల వరకూ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులు ఈ విషయంలో ఎలాంటి ఆందోళనా చెందొద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ తెలిపారు. పెదపాడు మండలం కొక్కిరపాడు, వట్లూరు, రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలును, సీతారామపురంలో దెబ్బతిన్న పంటలను శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ తూపాన్‌ కారణంగా రైతులకు ఎలాంటి నష్టమూ వాటిల్లకుండా చూడటమే రాష్ట్రప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. రాష్ట్రంలోని రైతుల కోరిక మేరకు వారి వద్ద ఉన్న ధాన్యం మొత్తం కొనుగోలు చేసేవరకూ వచ్చే ఏడాది మార్చి నెల వరకూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరచి ఉంచుతామన్నారు. గత రబీలో అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా ముందస్తుగా నవంబర్‌లో ప్రారంభించామన్నారు. వీటిని మార్చి వరకూ రైతులు కోరారని, ఇందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 37 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించడం లక్ష్యంగా నిర్ణయించామని, అయినప్పటికీ ఎంత మేర ధాన్యం వచ్చినా సేకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రెండు రోజుల నుండి రాష్ట్రవ్యాప్తంగా 1.10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేశామన్నారు. నవంబరు చివరిలో తూపాన్‌ హెచ్చరిక నేపథ్యంలో ముందుగానే ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని చెప్పారు. కోత కోసిన ధాన్యాన్ని రైతుల కల్లాల నుండి నేరుగా ఆఫ్‌ లైన్‌ విధానంలో రైస్‌ మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. వర్షాల కారణంగా పంట తడవకుండా ఉండేందుకు టార్పాలిన్‌లు అందించామన్నారు. తేమశాతంలో రైతులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. ఏదో రేటుకు దళారులకు తమ ధాన్యాన్ని రైతులు అమ్ముకోవద్దని, వారి వద్ద ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతుల పట్ల సానుకూలంగా ఉండాలని అధికారులను ఆదేశించామన్నారు. కోతకు వచ్చిన పంటలో మొలకలు వచ్చిన ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉందని, ఇందుకోసం ఫుడ్‌ కొర్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా వారితో టెస్ట్‌ మిల్లింగ్‌ చేసి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. రంగుమారిన ధాన్యం, నూకశాతంపై రైతులకు, మిల్లర్లకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పంట నష్టాలపై మూడు రోజుల్లో సర్వే పూర్తి చేస్తామని, పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తామని, కోత కోయని పంట నష్టపోయిన వారికి పంటల బీమా కింద పరిహారం అందిస్తామని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందొద్దని అరుణ్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. జెసి బి.లావణ్యవేణి మాట్లాడుతూ జిల్లాలో రూ.రెండు లక్షల 67 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. ఇంతవరకు 1. 10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. గత రెండు రోజులగా తూపాన్‌ వలన జిల్లాలో ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, దెందులూరు, పెదపాడు మండలాల్లో ధాన్యం అధికంగా సాగు చేస్తారన్నారు. గురువారం నాటికి 800 మెట్రిక్‌ టన్నుల ధాన్యం తరలించాల్సి ఉండగా, వాటిని కూడా శుక్రవారం తరలించామన్నారు. చింతలపూడి మండలం ప్రగఢవరంలోని రైతు తుపాన్‌ మూలంగా తన ధాన్యం తడిచి 28 శాతం తేమ కారణంగా మొలకెత్తిందని, దానిని కొనుగోలు చేయాలని కోరారని, దీనిపై సిఎం జగన్‌ ఆదేశాల మేరకు, తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని మిల్లర్ల ద్వారా కొనుగోలు చేసి సొమ్ము చెల్లించామని, దీనికి సంబంధిత రైతు ఆనందం వ్యక్తం చేశారన్నారు.

➡️