ఇదేందయ్యా సుందరేశా…!?

Feb 23,2024 11:24 #kerala bjp

 ‘ప్రోమో సాంగ్‌’తో నవ్వులపాలైన కేరళ బీజేపీ

 కేంద్ర ప్రభుత్వం అవినీతిమయమంటూ విమర్శలు

ఓడించాలని ప్రజలకు పిలుపు

 2014 పాటను వైరల్‌ చేసి నాలిక కరుచుకున్న కమలదళం

తిరువనంతపురం : ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల ప్రచారంలో తన గొప్పతనాన్ని, తాను సాధించిన విజయాలను గురించి గోరంతలు కొండంతలు చేసి చెప్పుకుంటుంది. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలను ఎండగడుతుంది. కానీ కేరళలో బీజేపీ రాష్ట్ర కమిటీ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. ఆ పార్టీ విడుదల చేసిన ప్రోమో పాటలో ‘కేంద్రంలోని ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. దానిని ఓడించండి’ అని పిలుపునిచ్చారు. కేంద్రంలో ఉన్నది తమ పార్టీ ప్రభుత్వమే అని మరచిపోయారో ఏమో తెలియదు కానీ ఈ పాటతో కమలదళం నవ్వులపాలైంది. అప్రదిష్ట మూటకట్టుకుంది. సామాజిక మాధ్యమాలలో ఈ పాట వైరల్‌ కావడంతో బీజేపీ నాయకత్వం నాలిక కరుచుకుంది. అసలు ఈ వ్యవహారానికి బాధ్యులెవరంటూ ఆరా తీసింది. వారి నుండి వివరణ కోరింది. దీంతో జరిగిన పొరబాటు ఏమిటో బయటికి వచ్చింది… అదేమిటంటే ఆ పాట ఇప్పటిది కాదట. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రూపొందించిందట. అప్పుడు బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆ పాటను రూపొందించారు. ఇప్పుడు పొరబాటున అదే పాటను మరోసారి విడుదల చేశారు. జరగాల్సిన నష్టం జరిగిపోయాక నాలిక కరుచుకొని ఏం లాభం ?వెంటాడిన మరో వివాదంఅసలే అవమాన భారంతో కుంగిపోతుంటే బీజేపీని మరో వివాదం వెంటాడింది. దీనికి కారణం ఓ పోస్టర్‌. కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సుందరేశన్‌ ఫిబ్రవరి 20న ఎస్సీ, ఎస్టీ నేతలతో కలిసి భోజనం చేస్తారన్నది ఆ పోస్టర్‌ సారాంశం. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ పోస్టర్‌తో బీజేపీ అగ్రకుల ధోరణి మరోసారి బయటపడిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీనిని అనవసరంగా వివాదం చేస్తున్నారని సుందరేశన్‌ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలు బీజేపీకి చేరువ కావడాన్ని కొందరు తట్టుకోలేకపోతున్నారని ఆక్రోశం వెళ్లగక్కారు. కేరళలో ఎలాగైనా పట్టు సాధించాలని కలలు కంటున్న బీజేపీకి ప్రతి ఎన్నికల్లోనూ నిరాశే ఎదురవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగి ఇటీవల కేరళలోని దేవాలయాలను సందర్శించారు. రాష్ట్ర జనాభాలో సుమారు 20%గా ఉన్న క్రైస్తవుల ఓట్ల కోసం బీజేపీ కొన్ని కార్యక్రమాలు కూడా రూపొందించుకుంది. ఈ సారైనా కేరళలో పరువు నిలుపుకోవాలని విశ్వప్రయత్నం చేస్తోంది.

➡️