కేరళ గవర్నర్‌ ఆ పదవికి అనర్హుడు : సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో

Dec 19,2023 09:13 #CPIM, #cpm politburo, #governer, #kerala

ఇండియా న్యూస్‌ నెట్‌వర్క్‌- న్యూఢిల్లీ : కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఆ పదవికి ఏమాత్రం తగడని సిపిఐ(ఎం) విమర్శించింది. పార్టీ పొలిట్‌బ్యూరో సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఎన్నికైన రాష్ట్రప్రభుత్వంపై అదే పనిగా రాజకీయ దాడులు చేయడం ద్వారా ఖాన్‌ అన్ని హద్దులను మీరుతున్నారని, మొత్తంగానే ఆయన తప్పుడు ధోరణిలో ఉన్నారని పొలిట్‌బ్యూరో ఆక్షేపించింది. ‘రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగ పతనం మొదలైంది’ అంటూ గవర్నర్‌ చేసిన ప్రకటన దీనికొక తాజా నిదర్శనమని పేర్కొంది. రాష్ట్రప్రభుత్వంపై ఇలాంటి బెదిరింపులను రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ అనుమతించరని పేర్కొంది కేరళ, కాలికట్‌ విశ్వవిద్యాలయాల సెనేట్లలో నామినేట్‌ చేయాల్సిన స్థానాలను ఆర్‌ఎస్‌ఎస్‌ నామినీలతో ఆయన నింపివేయడం ద్వారా విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా గవర్నరు తన పదవిని దుర్వినియోగపరిచారని పొలిట్‌బ్యూరో విమర్శించింది. ఈ చేష్టలకు గాను విద్యార్థుల నుంచి గవర్నరు నిరసనలను ఎదుర్కొంటున్నారని తెలిపింది. శాంతియుతంగా నిరసన తెలిపే ప్రజాస్వామిక హక్కు విద్యార్థులకు ఉంది ఈ నిరసనలకు ముఖ్యమంత్రిపై గవర్నర్‌ నిందలు వేయడం, అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంపై సిపిఐ(ఎం) ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యాంగ బద్ధమైన గవర్నర్‌ పదవిలో ఉన్న వ్యక్తి వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని, ఆ పదవిలో కొనసాగడానికి అనర్హుడని ఆయన తన చేష్టల ద్వారా నిరూపించుకున్నారని పొలిట్‌బ్యూరో పేర్కొంది.

➡️