కార్తి చిదంబరానికి కాంగ్రెస్‌ పార్టీ షోకాజ్‌ నోటీసులు

Jan 9,2024 17:06 #Karti Chidambaram, #Rahul Gandhi

 చెన్నై :    రాహుల్‌ గాంధీపై వ్యాఖ్యలకు గాను సీనియర్‌ నేత కార్తి చిదంబరానికి కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం షోకాజ్‌ నోటీసులిచ్చింది. రాహుల్‌ గాంధీ పార్లమెంటులో అడుగుపెట్టిన సమయంలో కొందరు కాంగ్రెస్‌ నేతలు ఆయనకు ఎదురెళ్లి స్వాగతం పలికారు. నేతలందరికీ షేక్‌ హ్యాండ్స్‌ ఇచ్చిన రాహుల్‌ కార్తి చిదంబరాన్ని పట్టించుకోలేదు. దీంతో కార్తి చిదంబరం అసంతృప్తికి గురయ్యారు. అలాగే ఇటీవల ఓ టివి ఇంటర్వ్యూలో కార్తి ప్రధానిని ప్రశంసలతో ముంచెత్తారు. రాహుల్‌ గాంధీ కన్నా ప్రధాని మోడీ అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి అని అన్నారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్స్‌ (ఇవిఎం)పై తనకు పూర్తి విశ్వాసం ఉందని ఆ ఇంటర్వ్యూలో పేర్కొనడం గమనార్హం. అయితే ఇవిఎంలపై ఎన్నికల కమిషన్‌తో కాంగ్రెస్‌ వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించాలంటూ కార్తి చిదంబరానికి పార్టీ రాష్ట్ర శాఖ నోటీసులిచ్చింది.

అయితే ఈ నోటీసులపై ఆయన సన్నిహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ ( ఎఐసిసి ) మాత్రమే ఎంపికి నోటీసులు జారీ చేయగలదని వారు స్పష్టం చేశారు. తమిళనాడు కాంగ్రెస్‌ చీఫ్‌గా కార్తి చిదంబరాన్ని ఎదగనీయకుండా అడ్డుకునేందుకు పార్టీ రాష్ట్ర శాఖ నోటీసులను పంపిందని మండిపడ్డారు.

➡️