మానవ తప్పిదం వల్లే… కంటకాపల్లి రైలు ప్రమాదంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

Dec 10,2023 08:20 #visakhapatnam

-దీపావళికి 5జి సేవలు

ప్రజాశక్తి- గోపాలపట్నం (విశాఖపట్నం), వేపాడ (విజయనగరం జిల్లా) మానవ తప్పిదం వల్లే విజయనగరం జిల్లా కంటకాపల్లిలో ఇటీవల రైలు ప్రమాదం సంభవించిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఈ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోందని చెప్పారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీమ్‌లో భాగంగా రూ.20 కోట్లతో రైల్వే శాఖ విశాఖ జిల్లా సింహాచలం రైల్వే స్టేషన్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను శనివారం ఆయన ప్రారంభించారు. వికసిత్‌ భారత సంకల్ప యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా వేపాడ మండలం వీలుపర్తిలో నిక్షరు మిత్ర కింద టి.బి.రోగులకు పౌష్టికాహారాన్ని, పిఎం ఉజ్వల యోజన కింద పలువురు లబ్ధిదారులకు గ్యాస్‌ కనెక్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా అశ్వినీ వైష్ణవ్‌ మాట్లాడుతూ త్వరలో మరిన్ని వందే భారత్‌ రైళ్లు పట్టాలెక్కనున్నాయన్నారు. వారానికి ఒక వందే భారత్‌ రైలు నిర్మాణం జరుగుతోందని తెలిపారు. రైల్వేను రాజకీయాలతో ముడిపెట్టి చూడొద్దని, ఎపిలో రైల్వేల అభివృద్ధికి రూ.8,406 కోట్లను ఖర్చు చేస్తున్నామన్నారు. భూ కేటాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. దేశంలో 5జి మొబైల్‌ సర్వీసుల విస్తరణ చాలా వేగంగా జరుగుతోందన్నారు. దీపావళికి బిఎస్‌ఎన్‌ఎల్‌ 5జి సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. నాలుగు వేల సెల్‌ ఫోన్‌ టవర్లు ఏర్పాటవుతున్నాయన్నారు. అందులో ఎక్కువ ఉత్తరాంధ్రలోనే నిర్మాణం జరుగుతున్నాయని తెలిపారు. కొత్తవలస రైల్వేస్టేషను ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. కెకె.లైన్‌ను డబుల్‌ లైన్‌గా మార్పు చేస్తున్నట్టు తెలిపారు.

➡️