కన్నడ బిగ్‌బాస్‌ నటి సోను శ్రీనివాస్‌ గౌడ అరెస్ట్‌

బెంగళూరు : కన్నడ బిగ్‌బాస్‌ ఓటీటీ కంటెస్టెంట్‌, సోషల్‌ మీడియా స్టార్‌ సోను శ్రీనివాస్‌ గౌడను బెంగుళూరు పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. 8 ఏళ్ల చిన్నారిని ఎలాంటి నియమాలు పాటించకుండా… అక్రమంగా దత్తత తీసుకున్నారని, చిన్నారులను దత్తత తీసుకునే రూల్స్‌ను ఆమె బ్రేక్‌ చేసిందని పోలీసులు తెలిపారు. దీనిపై సోను శ్రీనివాస్‌ గౌడపై కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టి సోనును అరెస్టు చేశారు.

దత్తత తీసుకునే వ్యక్తికి.. ఆ చిన్నారికి మధ్య కనీసం 25 ఏళ్ల వయసు వ్యత్సాసం ఉండాలి. కానీ సోను శ్రీనివాస్‌ గౌడకు.. ఆ అమ్మాయికి వయసు వ్యత్సాసం అంతగా లేదనే విషయం వెలుగుచూసింది. అలాగే దత్తత తీసుకున్న పిల్లల ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయకూడదు. కానీ సోనూ అలాంటి నియమాలేవి పాటించలేదు. పైగా ఆ పాప తల్లిదండ్రులకు అనేక సౌకర్యాలు కల్పించి.. అక్రమంగా ఆ పాపను దత్తత తీసుకుందంటూ సోను శ్రీనివాస్‌ గౌడపై ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సోను శ్రీనివాస్‌ గౌడను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

దీనిపై సోను శ్రీనివాస్‌ గౌడ స్పందిస్తూ … తనకు తెలిసినంత వరకు దత్తత నియమాలు పాటించానని అన్నారు. ఆ చిన్నారి తల్లిదండ్రులను సంప్రదించిన తర్వాతే దత్తత కార్యక్రమం జరిగిందని అన్నారు. చట్టబద్ధంగా ఆ చిన్నారిని దత్తత తీసుకోవడానికి కనీసం 3 నెలల సమయం పడుతుందని తెలిపారు. ఆమె తల్లిదండ్రులు అంగీకరించిన తరువాతే ఆ పాపను దత్తత తీసుకున్నానని చెప్పారు. దీనిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని … ఈ కేసులో తాను నిర్దోషిగా బయటపడతానని సోనూ వివరించారు.

➡️