కదిరిలో ‘కందికుంట’ మార్క్‌

Apr 18,2024 21:30

కందికుంట వెంకటప్రసాద్‌

                  కదిరి టౌన్‌ : అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల గురించి ఆలోచించే నాయకుడు, ప్రజలకు కష్టం వస్తే చాలు వారి కష్ట, నష్టాలను అండగా నిలబడే నాయకుడు కందికుంట వెంకటప్రసాద్‌ అన్న పేరు కదిరి నియోజకవర్గ ప్రజల నుంచి విన్పిస్తోంది. కదిరి ప్రాంత సమస్యలపై అవగాహన కలిగి ప్రజలతోనే జీవితం ప్రయాణం సాగిస్తున్న కందికుంటతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని టిడిపి నాయకులు, కార్యకర్తలు విశ్వసిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ప్రచారాల్లో ప్రజల వద్దకు వెళ్లి వివరిస్తున్నారు. నియోజకవర్గంలోకి కందికుంట వెంకటప్రసాద్‌ రాక మునుపు టీడీపీలో స్థిరమైన నాయకత్వం లేక ఆ పార్టీతో పాటు ఆ పార్టీ శ్రేణులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉండేది. కందికుంట 2004లో రాజకీయాల్లోకి వచ్చిన తరువాత టీడీపీకి కదిరిలో బలం చేకూరింది. తన మార్కు రాజకీయాలతో టిడిపి ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా వ్యక్తిగత ఓటు బ్యాంకు కూడా సంపాదించుకున్నారని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల అనంతరం కదిరి నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల నుంచి అధికార ఒత్తిళ్లకు తట్టుకుని కార్యకర్తలకు కందికుంట అండగా నిలిచారని ఆపార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన నేతగా పేరొందిన కందికుంట వైసిపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను పార్టీ శ్రేణులతో కలిసి తనదైన శైలిలో ప్రశ్నించారు. ఎవరెన్ని బెదిరింపులకు గురిచేసినా పోరాటాల్లో ముందుంటున్నారు. కదిరి నియోజకవర్గం అభివృద్ధి వైపు దూసుకు వెళ్ళాలంటే అది కందికుంట వల్లనే సాధ్యమవుతుందని ఆయన అభిమానులు తెలియజేస్తున్నారు. అధికార పార్టీ నేతలు భూకబ్జాలు ఇతర రాజకీయ దందాలు మరీ ముఖ్యంగా కీలక పదవుల్లో ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేసి తీవ్ర అసమ్మతిని వ్యతిరేకతను మూట కట్టుకున్నారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. కదిరి నియోజకవర్గంలో అత్యధిక శాతం బీసీలు, ఇతర సామాజిక వర్గమైన మైనార్టీ, బలిజ ఓటర్లు ఇక్కడ ప్రధాన భూమికను పోషిస్తున్నారు. ప్రస్తుత అధికార పార్టీ నేతలు ఆయా వర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా అణచివేత ధోరణికి గురిచేశారని టిడిపి నాయకులు విమర్శిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈ నియోజకవర్గంలో టిడిపికి చెందిన మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అధికార పార్టీ అక్రమాలకు, ఆగడాలకు కళ్లెం వేస్తూ నిరంతరం ప్రజలతో మమేకమై నియోజక వర్గంలో బలమైన శక్తిగా ఎదిగి ప్రజలలో మాస్‌ లీడర్‌గా ముద్ర వేసుకున్నారని టిడిపి నాయకులేకాకుండా రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. గత 20 సంవత్సరాలుగా కందికుంట మీద ఉన్న అభిమానం, విశ్వాసం ప్రజల్లో ఏమాత్రం చెక్కు చెదరలేదని కుల, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రజలకు అండగా నిలబడతున్న ఆయన నాయకత్వం పట్ల నమ్మకంతో వచ్చే ఎన్నికల్లో కదిరి నుండి ఎమ్మెల్యేగా కందికుంట గెలుస్తారని టిడిపి శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కొనసాగుతున్న వలసల పరంపరకందికుంట వెంకటప్రసాద్‌ నాయకత్వంపై నమ్మకంతో ఈసారి టిడిపిలోకి భారీగా వలసల పరంపర కొనసాగుతోంది. ప్రతి రోజూ నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన ఇతర పార్టీల నాయకులు కందికుంట సమక్షంలో టిడిపిలోకి చేరుతున్నారు. 20 ఏళ్లుగా గెలుపోటములతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజల కోసం పనిచేసిన కందికుంట గెలుపు కోసం టిడిపి శ్రేణులు ఎన్నికల కురక్షేత్రంలో పనిచేస్తూ ముందుకు సాగుతున్నారు.

➡️