కొందరికే కందిపప్పు

Dec 2,2023 10:19 #kandipappu, #Ration
  • ఆరు నెలలుగా ఆగిన పంపిణీ
  • డిసెంబరులోనూ అరకొర కేటాయింపులు

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌లో ఏ సరుకు ఏ నెల అందుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రేషన్‌ కార్డుదారులకు ఆరు నెలలుగా నిలిపివేసిన రాయితీ కందిపప్పు ఎట్టకేలకు ఈనెల నుంచి మళ్లీ పంపిణీ చేస్తున్నా.. అదీ కొందరికి మాత్రమే అందుతుంది. జిల్లాలకు కందిపప్పు నిల్వలు అంతంతమాత్రమే రావడంతో, అందరికీ అందించే పరిస్థితి కనిపించడం లేదు. నిల్వలు తక్కువగా ఉండడంతో అర్బన్‌ ప్రాంతాలకు మాత్రమే సరఫరా చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. జూన్‌, జూలైలో పంపిణీ ఆగిన తర్వాత రెండు నెలలకు సంబంధించిన కందిపప్పును ఆగస్టు రేషన్‌తో కలిపి ఇస్తామని పౌరసరఫరాల మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రకటించినా, లబ్ధిదారులకు కందిపప్పు అందడం లేదు.అరకొరగా కేటాయింపులుమొబైల్‌ డిస్ట్రిబ్యూషన్‌ యూనిట్‌ (ఎండియు) వాహనాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1,48,07,061 రేషన్‌ కార్డుదారులకు ప్రభుత్వం సరుకులను అందిస్తోంది. వీటి ద్వారా 4,31,48,684 మంది పేదలు లబ్ధి పొందుతున్నారు. కార్డుపై ఒక్కో కుటుంబానికి కేజీ చొప్పున ప్యాకెట్ల రూపంలో కంది పప్పు అందిస్తోంది. డిసెంబరు నెల రేషన్‌కు 14,469 మెట్రిక్‌ టన్నుల కందిపప్పు అవసరం కాగా, ప్రభుత్వం 2,951 టన్నులనే జిల్లాలకు కేటాయించింది. పంచదార కేటాయింపులు కూడా అరకొరగానే ఉన్నాయి. రేషన్‌ కార్డుపై అరకిలో చొప్పున పంచదార అందిస్తోంది. డిసెంబరుకు 7,404 మెట్రిక్‌ టన్నులు అవసరం కాగా, 6,563 మెట్రిక్‌ టన్నులను కేటాయించింది.బహిరంగ మార్కెట్‌లో పైపైకి ధరలుప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్‌) ద్వారా పంపిణీ నిలిచిపోవడంతో, కందిపప్పు ధరలు క్రమేణా పెరగుతున్నాయి. ఆగస్టులో కేజీ కందిపప్పు రూ.152 ఉండగా అక్టోబరు నాటికి రూ రూ.160కు చేరింది. నవంబరు మొదటి వారంలో రూ.165 ఉండగా, ప్రస్తుతం రూ.170కు చేరింది.

➡️