కమల్‌నాథ్‌పై కాంగ్రెస్‌ వేటు.. మధ్యప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌గా జితూ పట్వారీ

భోపాల్‌  :    మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా కమల్‌నాథ్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలగించింది. మరోసారి తిరుగులేని మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని పిసిసి చీఫ్‌, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో బిజెపి విజయం సాధించి అధికారం చేపట్టింది. కమల్‌నాథ్‌ కారణంగానే పార్టీ ఓటమిపాలైందని సీనియర్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిజెపికి వ్యతిరేకంగా పోరాడలేకపోయారని, ప్రచారంలో అలసత్వం వహించారని పార్టీ అందుకే ఓడిపోవాల్సి వచ్చిందని ధ్వజమెత్తారు. కమల్‌నాథ్‌ వల్లే 66 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చిందని ఆరోపించారు. దీంతో ఆయనను పీసీసీ అధ్యక్ష పదవి నుండి పార్టీ అధిష్టానం తొలగించింది. ఆయన స్థానంలో ఒబిసి నేత అయిన జీతు పట్వారీని నియమించింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

వచ్చే ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కమల్‌నాథ్‌ నాయకత్వంలో ఘోర పరాభవం ఎదురవడంతో మరోసారి ఆయన నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లడం మంచిది కాదని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి చేతిలో ఓటమి పాలవడం గమనార్హం.

కాగా, కమల్‌నాథ్‌ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఆయన వయస్సు 77 ఏళ్లు. కేంద్ర కేబినెట్‌ మంత్రిగా, తొమ్మిదిసార్లు లోక్‌సభ ఎంపిగా, సుమారు 15 నెలల పాటు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పలు బాధ్యతలు చేపట్టారు. ఐదేళ్లుగా మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ చీఫ్‌గానూ పనిచేశారు. అయితే మరో కాంగ్రెస్‌ నేత జ్యోతిరాదిత్య సింథియా తిరుగుబాటుతో 2020లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మరో ఐదేళ్లు బిజెపి అధికారంలో ఉండే అవకాశం ఉంది. దీంతో ఆయన ఇంటికే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

➡️