చెత్త వెయ్యొద్దంటే దాడి చేస్తారా?

Jan 24,2024 12:38 #Attacks On Dalit, #East Godavari, #KVPS
kvps condomn dalit attacks

కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి  
కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్)

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం సిటీలో చెత్త వేయొద్దు అన్నందుకు శానిటరీ ఇన్‌స్పెక్టర్లయిన దళిత దంపతులపై నడిరోడ్డుపై అమానుషంగా దాడిచేసిన సంఘటన రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓ నల్లప్ప, అండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. దంపతులకు మెరుగైన వైద్యం అందించి రక్షణ కల్పించాలని కోరారు. ఈ మేరకు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. నగరపాలక సంస్థ పరిధి పబ్లిక్‌ హెల్త్‌ విభాగంలో కప్పల రజనీదేవి, ధనరాజు దంపతులు శానిటరీ ఇన్‌స్పెక్టర్లుగా పనిచేస్తున్నారు. ఈ నెల 21న విధి నిర్వహణలో ఉండగా మోరంపూడి సమీపంలో పెదిరెడ్డి వెంకన్నబాబు తన ఇంటిలోని చెత్తను రోడ్డు డివైడర్‌లో ఉన్న మొక్కల్లో వేయడాన్ని గమనించి నిలదీశారు. చెత్త అక్కడ వేయకూడదని చెప్పడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎంత చెప్పినా వెంకన్న వినకపోవడంతో ధనరాజు డివైడర్‌ మధ్యలో పోసిన చెత్తను ఫొటో తీశారు. దీంతో వెంకన్న అతని చేతిలో ఉన్న ఇనుప గమేళాతో ధనరాజు తలపై కొట్టడంతో గాయమైంది. రజనీదేవి వెంకన్నను వారించగా ఆమెను కూడా జుట్టు పట్టుకుని కొట్టాడు. దీంతో ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజులైనా వెంకన్నపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాగా రజనీదేవిని వెంకన్న జుట్టు పట్టుకుని కొట్టిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె మంగళవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వెంటనే ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిపై పిర్యాదు చేసిన పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదు? ఎందుకు తాత్సారం చేస్తున్నారని కెవిపిఎస్ ప్రశ్నించింది.

➡️