రాహుల్‌ ఔట్‌… పడిక్కల్‌ ఇన్‌..

Feb 13,2024 10:02 #Cricket, #Sports
  • తుదిజట్టులో కోసం సర్ఫరాజ్‌ నిరీక్షణ

రాజ్‌కోట్‌: మూడోటెస్ట్‌ ప్రారంభానికి ముందు టీమిండియాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి వ్యక్తిగత కారణాలతో, శ్రేయస్‌ అయ్యర్‌ గాయం కారణంగా సిరీస్‌ మొత్తానికి దూరం కాగా.. తాజాగా రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే మూడోటెస్ట్‌కు ముందు కెఎల్‌ రాహుల్‌ దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్ట్‌లకు బిసిసిఐ ప్రకటించిన జట్టులో కెఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా చోటు దక్కించుకున్నా.. ఫిట్‌నెస్‌ నిరూపించుకోవడంలో అతడు విఫలమయ్యాడు. దీంతో అతడు మూడోటెస్ట్‌కు దూరమైనట్లు బిసిసిఐ సోమవారం ప్రకటించింది. అతడి స్థానంలో దేవదత్‌ పడిక్కల్‌కు చోటు కల్పించింది. రాహుల్‌తో పాటు జస్ప్రీత్‌ బుమ్రా కూడా సోమవారం రాజ్‌కోట్‌కు జట్టు సభ్యులతో కలిసి రావల్సి ఉండగా.. అతడు ఇంకా బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సిఎ)లోనే ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలిటెస్ట్‌ అనంతరం గాయపడ్డ రాహుల్‌ విశాఖలో జరిగిన రెండో టెస్ట్‌ ఆడలేదు. రాహుల్‌ స్థానం దక్కించుకున్న 23ఏళ్ల కర్ణాటక బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ ఈ సీజన్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. తమిళనాడుతో జరిగిన రంజీట్రోఫీ మ్యాచ్‌లో 151పరుగులతో రాణించిన పడిక్కల్‌.. ఈ సీజన్‌ రంజీట్రోఫీలో మూడు సెంచరీలతో చెలరేగి ఆడుతున్నాడు. అలాగే ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ(105 పరుగులు) సెంచరీతో మెరిసాడు. ఛటేశ్వర పుజారా, అజింక్యా రహానేలను పక్కన బెట్టి బిసిసిఐ సెలక్టర్లు పడిక్కల్‌ మొగ్గు చూపిన విషయం తెలిసిందే.ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ లీచ్‌ సిరీస్‌ మొత్తానికి… ఇంగ్లండ్‌ జట్టు ఎడమచేతి వాటం స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ భారత్‌తో జరిగే మిగిలిన మూడు టెస్ట్‌లకు దూరమయ్యాడు. తొలి టెస్ట్‌లో మోకాలి గాయంతో వైజాగ్‌ టెస్ట్‌కు దూరమైన లీచ్‌.. కోలుకొనేందుకు ఇంకా సమయం పట్టనున్న దృష్టా ఇంగ్లండ్‌-వేల్స్‌ క్రికెట్‌ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అతడు అబుదాబినుంచి స్వదేశానికి తిరిగి వెళ్తాడని, మూడోటెస్ట్‌ కోసం అతడి పేరును పరిశీలించవద్దని, అతనికి ప్రత్యామ్నాయంగా మరో స్పిన్నర్‌నూ భారత్‌కు పంపడం లేదని సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

➡️