Jute Mill: నీలం జ్యూట్‌ మిల్లు లాకౌట్‌ ఎత్తివేయాలి

Mar 11,2024 20:11 #CITU, #Jute Mills, #Protest, #srikakulam
  •  కలెక్టరేట్‌ వద్ద కార్మికుల ధర్నా

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ : నీలం జ్యూట్‌ మిల్లు అక్రమ లాకౌట్‌ను వెంటనే ఎత్తివేయాలని, పరిశ్రమను తెరిపించి ఉపాధి కల్పించేందుకు జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు. యాజమాన్యం మొండివైఖరి విడనాడాలని, పరిశ్రమను వెంటనే తెరవాలని డిమాండ్‌ చేశారు. నీలం జ్యూట్‌ కార్మిక సంఘం (సిఐటియు) ఆధ్వర్యాన సోమవారం ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, నగర కన్వీనర్‌ ఆర్‌.ప్రకాశరావు మాట్లాడుతూ..యాజమాన్యం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఈ నెల నాలుగున లాకౌట్‌ ప్రకటించి 650 మంది కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికశాఖ అధికారులతో సంయుక్త సమావేశానికి పిలిచినా యాజమాన్యం రాకపోవడం దుర్మార్గమన్నారు. కార్మికుల శ్రమతో లాభాలు గడించిన యాజమాన్యం కార్మికులతో సంప్రదించకుండా, ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా లాకౌట్‌ ప్రకటించడం కార్మిక చట్టాలను తుంగలో తొక్కడమేనని తెలిపారు. లాకౌట్‌పై జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో నీలం జ్యూట్‌ మిల్లు కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.నాగేశ్వరరావు, నక్క సూరిబాబు, కార్మికులు పాల్గొన్నారు.

➡️