కోల్‌కతా హైకోర్టు జడ్జి పదవికి అభిజిత్‌ గంగోపాధ్యాయ రాజీనామా

 కోల్‌కతా :   కోల్‌కతా హైకోర్టు జడ్జి పదవికి జస్టిస్‌ అభిజిత్‌ గంగోపాధ్యాయ   రాజీనామా చేశారు.  మంగళవారం ఉదయం హైకోర్టులోని ఛాంబర్‌కు చేరుకున్న ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్‌, కోల్‌కతా చీఫ్‌ జస్టిస్‌ టి.ఎస్‌. శివజ్ఞానమ్‌లకు కూడా రాజీనామా లేఖలను పంపారు.

తాను గురువారం బిజెపిలో చేరనున్నట్లు ప్రకటించారు. మొదట మీడియా సమావేశం నిర్వహించి  తన రాజీనామాను  ప్రకటించాలనుకున్నారు. అయితే సమావేశాలపై నిషేధ ఆంక్షలు  ఉండటంతో   మీడియా సమావేశాన్ని  రద్దు చేశారు.  రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని తమ్లుక్‌ నియోజకవర్గం నుండి అభిజిత్‌ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు సమాచారం.

కాగా, 2009 నుండి తమ్లుక్‌ నియోజకవర్గం తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టిఎంసి) కంచుకోటగా ఉంది. ఈ నియోజకవర్గానికి 2009 నుండి 2016 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుడి భుజంగా ఉన్న సువేందు అధికారి ప్రాతినిథ్యం వహించారు. ఇటీవల సువేందు బిజెపి గూటికి చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సువేందు సోదరుడు, టిఎంసి నేత దిబ్యేందు అధికారి సిట్టింగ్‌ ఎంపిగా కొనసాగుతున్నారు.

పశ్చిమ బెంగాల్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌లపై  జస్టిస్  అభిజిత్‌ గంగోపాధ్యాయ్   విచారణ చేపట్టారు.  ఈ కేసుపై దర్యాప్తు చేపట్టాలని   సిబిఐ,  ఇడిలకు  ఆదేశాలు జారీ  చేశారు.  ఈ అంశం  పశ్చిమ బెంగాల్‌తోపాటు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా  మారింది.

➡️