వేతనాల్లో కోతలను నిరసిస్తూ బ్రిటన్‌వ్యాప్తంగా జూనియర్‌ డాక్టర్ల 144 గంటల సమ్మె

Junior doctors in England agree to pay talks after three-day strike

 

లండన్‌ : వేతనాల్లో కోతలను నిరసిస్తూ బ్రిటన్‌ వ్యాప్తంగా జూనియర్‌ డాక్టర్లు సమ్మెకు దిగారు. 144గంటల కార్యాచరణలో భాగంగా బుధవారం ఉదయం 7గంటల నుండి ఈ సమ్మె ఆరంభమైంది. ఎన్‌హెచ్‌ఎస్‌ చరిత్రలోనే సుదీర్ఘమైన ఈ సమ్మె జనవరి 9వ తేదీ మంగళవారం ఉదయం 7గంటలతో ముగుస్తుంది. శీతాకాలం ప్రారంభం కావడంతో వైరస్‌ల వ్యాప్తితో ఆరోగ్య సేవలపై ఒత్తిడి పెరగనున్న తరుణంలో సమ్మె ప్రారంభమైంది. ఇదిలావుండగా, తక్షణమే సమ్మెను విరమించి, చర్చలకు రావాల్సిందిగా ఆరోగ్య, సామాజిక సంక్షేమ విభాగం మంగళవారం బ్రిటీష్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (బిఎంఎ)ను కోరింది. దానిపై బిఎంఎ జూనియర్‌ డాక్టర్ల కమిటీ సహ అధ్యక్షుడు డాక్టర్‌ రాబ్‌ లారెన్సన్‌, డాక్టర్‌ వివేక్‌ త్రివేదిలు స్పందిస్తూ ఈ చివరి నిముషంలోనైనా ప్రభుత్వం మంచి విశ్వసనీయమైన ఆఫర్‌తో ముందుకు రావాల్సిందని వ్యాఖ్యానించారు. 2008 నుండి జూనియర్‌ డాక్టర్ల వేతనాల్లో నాలుగవ వంతుకు పైగా కోత విధిస్తున్నారు. వేసవి కాలంలో, ఇంగ్లండ్‌వ్యాప్తంగా జూనియర్‌ డాక్టర్ల వేతనాలను ప్రభుత్వం సగటున 8.8శాతం పెంచింది. అయితే, ఈ పెంపు సరిపోదని, 2008-09 నుండి వేతనాల్లో నమోదవుతున్న కోతను ఆపి, పూర్తి స్థాయి వేతనాలను పునరుద్ధరించాల్సిందిగా వారు కోరుతున్నారు. హాస్పిటల్‌ కన్సల్టెంట్స్‌, స్పెషలిస్ట్స్‌ అసోసియేషన్‌ యూనియన్‌కి చెందిన జూనియర్‌ డాక్టర్లు కూడా తమ సహచరులతో కలిసి సమ్మెలో పాల్గొననున్నారు. గతేడాది ఆరోగ్య మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చినట్లుగా మంచి ఆఫర్‌ వస్తుందనే ఆశతో శలవులను గడిపామని, కానీ దురదృష్టవశాత్తూ అలాంటిదేమీ జరగలేదని లారెన్సన్‌, త్రివేదిలు ఒక ప్రకటనలో తెలిపారు. క్రిస్మస్‌ సమయంలో కూడా చర్చలకు రావడానికి సుముఖంగానే వున్నామని చెప్పామని, అలాగే రాబోయే సమ్మె కాలంలోకూడా తాము చర్చలకు సిద్ధంగానే వున్నామని వారు స్పష్టం చేశారు. అనూహ్యమైన ఈ సమ్మె కార్యాచరణతో వేలాదిమంది రోగుల ఆరోగ్య సేవలు ఇబ్బందుల్లో పడతాయని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో సత్వరమే సమస్యను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

➡️