U.K. court : అసాంజెను అమెరికాకు తక్షణమే అప్పగించలేం

Mar 27,2024 00:15 #Julian Assange, #WikiLeaks

లండన్‌ : వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజెను అమెరికాకు తక్షణమే అప్పగించడం కుదరదని బ్రిటన్‌ కోర్టు స్పష్టం చేసింది. అమెరికా మరిన్ని హామీలు ఇవ్వాల్సిన అవసరం వుందని పేర్కొంది. దీనితో అమెరికాకు తన అప్పగింతను సవాలు చేస్తూ అసాంజె పోరాడేందుకు మరో అవకాశం లభించినట్లయింది. అనేక కారణాల రీత్యా అసాంజె అప్పగింతను సవాలు చేయడానికి అవకాశం వుందని ఇద్దరు సీనియర్‌ న్యాయమూర్తులు తమ రూలింగ్‌లో చెప్పారు.
ఉన్నత స్థాయిలో రహస్యంగా వుంచాల్సిన అమెరికా మిలటరీ రికార్డులను, దౌత్య సమాచారాన్ని వెల్లడించినందుకు గూఢచర్య చట్టం కింద 18 అభియోగాలపై అసాంజెను విచారించాలని అమెరికా భావిస్తోంది. అమెరికాకు అప్పగించడానికి బ్రిటన్‌ ఆమోదం తెలియజేయడాన్ని సవాలు చేసేందుకు అసాంజె తరపు న్యాయవాదులు అనుమతి కోరారు. అసాంజె ప్రాసిక్యూషన్‌ పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో వుందని వారు పేర్కొన్నారు.
అమెరికా రాజ్యాంగం మొదటి సవరణపై అసాంజె ఆధారపడవచ్చా? లేదా? ఆయన మరణ శిక్షకు లోబడి వుండవచ్చా? లేదా? అన్న ప్రశ్నలపై అమెరికా సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వాల్సి వుందంటూ కోర్టు అమెరికా అధికారులకు మరో అవకాశాన్ని ఇచ్చింది.
ఆ హామీలు రానట్లైతే, అసాంజెను అప్పీల్‌ చేసుకోవడానికి అనుమతిస్తామని వారు తెలిపారు. దీనిపై తదుపరి విచారణ మే 20న జరగనుంది. అసాంజె చర్య వల్ల తమ ఏజెంట్ల ప్రాణాలు చిక్కుల్లో పడ్డాయని, ఆయన నేరాన్ని క్షమించేది లేదని అమెరికా వాదిస్తోంది.

➡️