మళ్లీ తీహార్‌ జైలుకు కవిత

  •  9 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ మద్యం కేసు వ్యవహారంలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పోలీసులు మళ్లీ తీహార్‌ జైలుకు తరలించారు. ఇప్పటికే ఇడి కేసులో తీహార్‌ జైల్లో ఉన్న కవితను సిబిఐ కస్టడికి అనుమతినిచ్చింది. దీంతో సిబిఐ విచారణ జరిపింది. కస్టడి ముగియడంతో సిబిఐ అధికారులు సోమవారం రౌస్‌ అవెన్యూ కోర్టులో ప్రవేశపెటింది. కోర్టు మళ్లీ జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. ఈసారి సిబిఐ దాఖలు చేసిన కేసులో ఆమెకు తొమ్మిది రోజుల కస్టడీ విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇడి కేసులో కవిత జ్యుడీషియల్‌ కస్టడీ ఏప్రిల్‌ 23 వరకు ఉండటంతో అప్పటి వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తున్నట్లు తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 23న చేపడతామని పేర్కొంది.

బిజెపి కస్టడీ : కవిత
కవిత సోమవారం కోర్టు హాల్‌ నుంచి బయటకు వస్తూ… ‘ఇది సిబిఐ కస్టడీ కాదు. బిజెపి కస్టడీ. బయట బిజెపోళ్లు మాట్లాడేదే… లోపల సిబిఐ వాళ్లు అడుగుతున్నారు. రెండేళ్లుగా అడిగిందే అడుగుతున్నారు. కొత్తదేమీ లేదు’ అని అన్నారు. అయితే కోర్టుకు హాజరయ్యే సమయంలో ‘జై తెలంగాణ’ నినాదం చేస్తూ కోర్టు హాల్‌లోకి వెళ్లారు.

స్పెషల్‌ జడ్జ్‌ సీరియస్‌
కవిత మీడియా స్టేట్మెంట్లపై ట్రయల్‌ కోర్టు స్పెషల్‌ జడ్జ్‌ కావేరి బవేజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత బెయిల్‌ పిటిషన్‌ సందర్భంగా ఆమె న్యాయవాది మోహిత్‌రావును ప్రశ్నించారు. మీడియా అడిగితే ఆమె మాట్లాడారని మోహిత్‌రావు కోర్టుకు నివేదించారు. దీనిపై స్పందించిన జడ్జ్‌ … ‘ఆమె ఏం చెప్పాలనుకున్నా, విచారణ సమయంలో సిబిఐకి చెప్పాలి. కానీ ఇలా కోర్టు ఆవరణలో మాట్లాడటం మంచిది కాదు’ అని వ్యాఖ్యానించారు.

➡️