క్రీడలలో రాణించడం ద్వారా ఉద్యోగాలు

Dec 24,2023 16:13 #Kakinada
  • జిల్లా క్రీడాభివద్ధి అధికారి బి శ్రీనివాస్‌ కుమార్‌
  • ఉత్సాహంగా తైక్వాండో బెల్ట్‌ ఎగ్జామ్‌

ప్రజాశక్తి-కాకినాడ : ప్రభుత్వం గుర్తించిన క్రీడలలో రాణించడం ద్వారా ఉద్యోగాలు పొందవచ్చని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌ కుమార్‌ సూచించారు. ఆదివారం జిల్లా తైక్వాండో సంఘం ఆధ్వర్యంలో వివిధ స్థాయిల్లో బెల్ట్‌ పరీక్షలు స్థానిక శ్రీనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా జిల్లా క్రీడాబివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌ కుమార్‌, ఒలింపిక్‌ సంఘ చీప్‌ ప్యాట్రన్‌ కర్రీ భామి రెడ్డి, ఎస్‌జిఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి బివివిఎస్‌వి ప్రసాద్‌ రాజు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి టైక్వాండో సంఘ కార్యదర్శి బి.అర్జునరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డిఎస్డివో శ్రీనివాస్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం గుర్తింపు పొందిన క్రీడలలో రాణించడం ద్వారా రెండు శాతం రిజర్వేషన్‌తో ప్రభుత్వ ఉద్యోగాలు పొందవచ్చు అన్నారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన గ్రామస్థాయి సచివాలయ వ్యవస్థలో సుమారు 2500 మంది స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు పొందారన్నారు. అంతేకాకుండా పెద్ద పెద్ద ఉద్యోగాలలో కూడా చాలామంది స్పోర్ట్స్‌ కోటా ద్వారా సాధించారన్నారు. అందువల్ల పాఠశాల స్థాయి నుండే విద్యార్థుల క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. మరో ముఖ్య అతిథి ఒలింపిక్‌ చీప్‌ ప్యాత్రన్‌ కర్రీ భామిరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు ఏదో ఒక క్రీడలో పాల్గొనడం వల్ల ఆరోగ్యంగా జీవించవచ్చన్నారు. క్రీడలను చిన్నప్పటినుండి కూడా వదలకుండా ప్రతిరోజు ఆడుతూ ఉండాలన్నారు. తాను 77 సంవత్సరాల వయసులో కూడా ప్రతిరోజు బ్యాడ్మింటన్‌ ఆడడం ద్వారా, మంచి ఆహారపు అలవాట్లను కొనసాగించడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలిగానన్నారు. అదేవిధంగా విద్యార్థులకు మంచి ఆహార అలవాట్లను అలవాటు చేయాలని తల్లిదండ్రులకు ఆయన సూచించారు. అదేవిధంగా ఎస్‌ జి ఎఫ్‌ ఐ ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌ మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు తైక్వాండో శిక్షణ ఇచ్చే విధంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో జాతీయ స్థాయి టైక్వాండో పోటీలకు ఎంపికైన జిల్లా క్రీడాకారులకు అతిధులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయి రిపరీలు, సీనియర్‌ క్రీడాకారులు, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️