జమ్మూ-శ్రీనగర్‌ రహదారి బ్లాక్‌..

Feb 22,2024 10:05 #Jammu and Kashmir
  •  అప్రమత్తంగా ఉండాలని పోలీసుల కీలక సూచనలు

శ్రీనగర్‌ : రాంబన్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిని బ్లాక్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. కాశ్మీర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే ఏకైక రహదారి లింక్‌ అయిన 270 కిలోమీటర్ల జమ్మూ-శ్రీనగర్‌ హైవేపై అనేక చోట్ల భారీ కొండచరియలు విరిగిపడటంతో రాక్‌ఫాల్‌ల కారణంగా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. సోమవారం నుంచే ఈపరిస్థితి ఉన్నప్పటికీ మూడు రోజులుగా రోడ్డు పునరుద్దరణకు అధికారులు ప్రయత్నిస్తున్నా.. రోడ్డుపై రాళ్లు అధికంగా ఉండటంతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడింది. బనిహాల్‌-రాంబన్‌ సెక్టార్‌లో చిక్కుకుపోయిన వాహనాలను క్లియర్‌ చేయడానికి బుధవారం రాత్రి చర్యలు చేపట్టారు. అయితే కిష్త్వారీ ప్రాంతం వద్ద భారీ కొండచరియలు ఉండటంతో ఆలస్యం అవుతోందని అధికారులు తెలిపారు. ఇక, ట్రాఫిక్‌ క్లియర్‌ అయ్యేంత వరకు జాతీయ రహదారి-44 లో ప్రయాణించకుండా ఉండాలని ప్రజలకు సూచించినట్లు పోలీసులు తెలిపారు. కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాలలో హిమపాతం భారీగా కురుస్తుండటంతో ఇప్పటికే అధికారులు హెచ్చరికలను కూడా జారీ చేశారు. అలాగే, ఎత్తైన ప్రాంతాలలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జమ్మూ-కాశ్మీర్‌ పోలీసులు సూచించారు.

➡️