విద్యార్థుల నిరసనలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైన జెఎన్‌యు 

Dec 12,2023 12:48 #academic complexes, #JNU, #Protests

న్యూఢిల్లీ :   విద్యార్థుల నిరసనలపై ఉక్కుపాదం మోపేందుకు జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ సిద్ధమైంది. నిబంధనలను ఉల్లంఘించారన్న పేరుతో విద్యార్థులపై ఏకపక్షంగా బహిష్కరణ వేటు వేసేందుకు జెఎన్‌యు యూజమాన్యం ప్రణాళికలు రూపొందించింది. విద్యార్థులు అకడమిక్‌ లేదా పరిపాలనా భవనానికి 100 మీటర్ల పరిధిలో నిరాహారదీక్ష, ధర్నా లేదా నిరసనలు చేపడితే రూ. 20,000 జరిమానా చెల్లించాల్సిందిగా జెఎన్‌యు ఆదేశించింది. జెఎన్‌యు ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ నవంబర్‌ 24న ” క్రమశిక్షణ మరియు ప్రవర్తన నిబంధనలు” మాన్యువల్‌ను ఆమోదించిన సంగతి తెలిసిందే. హింసాత్మక చర్యలు, సిబ్బంది లేదా విద్యార్థులను అక్రమంగా నిర్బంధించడం, యూనివర్శిటీ ఆస్తులకు నష్టం కలిగించడం, విద్య, పరిపాలనా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం వంటి నేరాలకు జరిమానాలతో పాటు విద్యార్థులను బహిష్కరించవచ్చని ఈ మాన్యువల్‌ పేర్కొంది.

మతం, జాతి, కులాలను కించపరిచే లేదా దేశ వ్యతిరేక వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లను ముద్రించడం, వ్యాప్తి చేయడం, లేదా అతికించినా రూ. 10,000 జరిమానా విధించవచ్చని తెలిపింది. అనుమతి లేకుండా యూనివర్శిటీ క్యాంపస్‌లో ఏదైనా పార్టీని నిర్వహిస్తే రూ. 6,000 జరిమానా, క్యాంపస్‌లో స్మోకింగ్‌ చేస్తే రూ. 500 జరిమానా విధించవచ్చని పేర్కొంది. ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలు, నిషేధిత పదార్థాలు, మద్యం సేవిస్తే రూ. 8,000 చెల్లించాల్సిందిగా పేర్కొంది.

ఈ మాన్యువల్‌ను జెఎన్‌యు విద్యార్థి యూనియన్‌ ఖండించింది. క్యాంపస్‌లో విద్యార్థుల అసమ్మతిని అణచివేసే చర్యలుగా వ్యాఖ్యానించింది. విద్యార్థుల సమస్యలను నినదించే యూనియన్‌ల కార్యకర్తలపై రాజకీయ ప్రతీకార చర్యలు చేపట్టేందుకు వినియోగించవచ్చని తెలిపింది. విద్యార్థుల మధ్య బహిరంగ చర్చలు, భిన్నాభిప్రాయాలు, నిపుణుల అభిప్రాయాలు వెల్లడికాకుండా నిరోధించేందుకు యూనివర్శిటీ ఇటువంటి చర్యలు చేపడుతోందని జెఎన్‌యుఎస్‌యు ఓ ప్రకటనలో తెలిపింది. మాన్యూవల్‌లో అనేక కీలకమైన అంశాలపై స్పష్టత లేదని, తప్పుడు సమాచారం, ఏకపక్షంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

➡️