JEE Main 2024 Session 1 ఫలితాలు విడుదల

న్యూఢిల్లీ : జేఈఈ మెయిన్‌ 2024 సెషన్‌-1 ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ మంగళవారం ఉదయం విడుదల చేసింది. ఎన్‌టీఏ జేఈఈ అధికారిక వెబ్‌ సైట్‌లో విద్యార్థులు తమ స్కోర్‌ కార్డును యాక్సెస్‌ చేసుకోవచ్చు. అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేసి ఫలితాలు పొందొచ్చు. గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రంలో పర్సంటైళ్లతో పాటు మొత్తం జేఈఈ మెయిన్‌ పర్సంటైల్‌ కూడా తెలుసుకోవచ్చు.

జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన సెషన్‌ 1 తుది కీని ఎన్‌టీఏ సోమవారం మధ్యాహ్నం విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రాథమిక కీ, తుది కీ మధ్య మార్పులు చోటుచేసుకున్నాయి. మొత్తం 17 ప్రశ్నలకు కీ మారగా గణితంలో 3 ప్రశ్నలు (రెండు ప్రశ్నపత్రాలు), రసాయనశాస్త్రంలో 3 ప్రశ్నల (3 ప్రశ్నాపత్రాలు)ను తొలగించారు.చివరి విడత (సెషన్‌ 2) ఏప్రిల్‌ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. గతంలో ఒకేసారి రెండు విడతలకు దరఖాస్తు చేసిన వారు మళ్లీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. మార్చి 2వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ

చివరి విడత పూర్తయ్యాక … రెండింటిలో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి (రెండు విడతలు రాస్తే) తీసుకొని ర్యాంకును కేటాయిస్తారు. తొలి విడత పేపర్‌-1కు దేశవ్యాప్తంగా 11,70,036 మంది విద్యార్థులు (95.8 శాతం) హాజరయ్యారు. మొత్తం 12,21,615 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎన్‌ఐటీల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీఆర్క్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ (బీప్లానింగ్‌) సీట్ల భర్తీకి జనవరి 24న నిర్వహించిన పేపర్‌-2 పరీక్షకు 74,002 మంది దరఖాస్తు చేసుకోగా.. 55,493 (75 శాతం) మంది హాజరయ్యారు.

➡️