విద్వేషాలను రెచ్చగొట్టడం సరికాదు

Apr 26,2024 00:40 #cpm, #prakatanaa

– రాజనాథ్‌సింగ్‌ వ్యాఖ్యలను ఖండించిన సిపిఎం
ప్రజాశక్తి – అనకాపల్లి :అనకాపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజనాథ్‌సింగ్‌ చేసిన విద్వేషపూరిత ప్రసంగంపై సిపిఎం అనకాపల్లి జిల్లా కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కె.లోకనాథం గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల్లో వారి ప్రభుత్వం వద్ద ఉన్న అభివృద్ధి ప్రణాళికలు, అజెండాలను వెల్లడించకుండా ఆర్టికల్‌ 370 రద్దు, రామమందిరం గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ ఉపసంహరణ ప్రకటన, సొంత గనులు కేటాయింపు వంటి ప్రాధాన్యత అంశాలను విస్మరించి అధికారంలోకి వస్తే ఒకే దేశం – ఒకే ఎలక్షన్‌ అమలు చేస్తామని చెప్పడం ప్రజాస్వామిక హక్కులను, విలువలను దెబ్బతియ్యడమే అవుతుందని తెలిపారు. పేదరికం, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించకుండా రామమందిరం నిర్మాణాన్ని విజయంగా చెప్పుకోవడం బాధ్యతా రహితమని పేర్కొన్నారు. ఎన్నికల ప్రసంగాల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధి పొందడానికి పథకం ప్రకారం బిజెపి వ్యవహరిస్తోందని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ కార్మికులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని తెలిపారు. జిల్లాకు వలస వచ్చి పచ్చని పల్లెల్లో విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్న వలసపక్షి సిఎం రమేష్‌ను ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ వివిధ రూపాల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న కూటమి ఎంపి అభ్యర్థి రమేష్‌పై అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️