పాలస్తీనా యూనివర్శిటీపై ఇజ్రాయిల్‌ దాడి .. వీడియో వైరల్‌

Jan 19,2024 13:32 #Gaza University, #israel hamas war

న్యూఢిల్లీ :   గాజాలోని పాలస్తీనా యూనివర్శిటీ ప్రధాన భవనంపై ఇజ్రాయిల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడిఎఫ్‌) దాడి చేపట్టిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. శుక్రవారం విడుదలైన ఈ వీడియోలో యూనివర్శిటీ భవనం కనిపించగా, అనంతరం లోపల ఉంచిన బాంబుల కారణంగా పేలిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అనంతరం ఆ ప్రదేశమంతా దట్టమైన పొగ వ్యాపించింది. ఈ వీడియోపై స్పష్టత నివ్వాల్సిందిగా అమెరికా ఇజ్రాయిల్‌ను ఆదేశించింది. వీడియోపై తగిన సమాచారం లేదని, స్పందించేందుకు యుఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధి డేవిడ్‌ మిల్లర్‌ నిరాకరించారు.

దక్షిణ గాజాలోని ప్రధాన నగరమైన ఖాన్‌ యూనిస్‌పై ఇజ్రాయిల్‌ వైమానిక, తుపాకీ కాల్పులకు దిగిన సంగతి తెలిసిందే. హమాస్‌ నేతలు ఈ ప్రాంతంలో తమ స్థావరాలను ఏర్పరుచుకున్నారని.. అందుకే లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయిల్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. అల్‌ అమాల్‌ అస్పత్రి సమీపంలో ఫిరంగి కాల్పులు వినిపించినట్లు పాలస్తీనియన్‌ రెడ్‌ క్రెసెంట్‌ పేర్కొంది. ఒక్క రాత్రిలోనే 77 మంది మరణించినట్లు హమాస్‌ నియంత్రణలో ఉన్న గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

➡️