వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లడమే నేరమా..?

Feb 13,2024 16:21 #bulding worker, #Dharna, #Kakinada
  • నాలుగేళ్ళ నుండి కోర్టుల చుట్టూ భవన నిర్మాణ కార్మికులు
  • కూలీల సొమ్ము 800 కోట్లు అపహరించారని విమర్శ

ప్రజాశక్తి కాకినాడ : భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 2019లో అప్పటి వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ఇంటికి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన భవన నిర్మాణ కార్మికులపై కేసులు పెట్టి, ఏళ్ల తరబడి కోర్టులు చుట్టూ తిప్పుతూ జగన్ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతుందని, కార్మికుల సమస్యలు పరిష్కరించమని అడగడమే నేరమైయ్యే పాలన రాష్ట్రంలో సాగుతుందని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వ శేషబాబ్జి, చెక్కల రాజ్ కుమార్ విమర్శించారు. ఈ సందర్భంగా ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్ స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు నిట్ల శ్రీను, రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణ కార్మికుల సమస్యలు పెరిగిపోయాయని, ఇసుక పంపిణీ నిలుపుదల చేయడంతో నెలల తరబడి ఉపాధి లేకపోవడంతో రాష్ట్ర వ్యాపితంగా 20 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు జగన్ ప్రభుత్వం కారణమైందని, కరోనా సమయంలో ఉపాధి నిలిచిపోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు ఆర్థిక సహకారం చేస్తానని 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల నుండి దరఖాస్తులు స్వీకరించి మూడేళ్లలో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వయానా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 1214 మెమో ద్వారా 2021 వరకు అమలులో ఉన్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను నిలిపివేసి జగన్ ప్రభుత్వం కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. నిర్మాణ కూలీలు, తాపీ మేస్త్రులు, కార్పెంటర్లు, పెయింటర్స్ దాచుకున్న 800 కోట్ల సంక్షేమ నిధులను సైతం జగన్ ప్రభుత్వం అడ్డదారిలో కాజేసిందని విమర్శించారు. ఒకపక్క ఉపాధి లేక మరోపక్క నిర్మాణ సామాగ్రి ధరలు విపరీతంగా పెరగడం, మరొకవైపు సంక్షేమాన్ని నిలిపివేయడం, దాచుకున్న సొమ్ములను సైతం అపహరించిన జగన్ దుర్మార్గ పాలనకు స్వస్తి పలకాలని భవన నిర్మాణ కార్మికులకు పిలుపునిచ్చారు. కోర్టుకు హాజరైన వారిలో గడిగట్ల సత్తిబాబు, కరణం విశ్వనాథం, మాగాపు నాగు, మేడిశెట్టి వెంకటరమణ, వెన్న ఉమామహేశ్వరరావు, ముమ్మన శ్రీను, కొత్త అంజిబాబు, తుంగల లక్షణరావు, కంచుమర్తి కాటం రాజు తదితరులు పాల్గొన్నారు.

➡️