మోడీ దిగొచ్చే వరకూ ఉక్కు పోరాటం

Dec 27,2023 21:55 #Dharna, #visakha steel

– జిందాల్‌తో ఒప్పందాన్ని బహిరంగ పర్చాలి : సిహెచ్‌.నర్సింగరావు, ఆదినారాయణ

– జివిఎంసి వద్ద వెయ్యి రోజులకు చేరుకున్న స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ దీక్షలు

– విశాఖలో భారీ ర్యాలీ, సభ

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం):వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేసే వరకు పోరాటం ఆగదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు, స్టీల్‌ప్లాంట్‌ గుర్తింపు యూనియన్‌ నాయకులు డి.ఆదినారాయణ స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్‌, ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ కోసం విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యంలో విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద కొనసాగుతున్న రిలే దీక్షలు బుధవారానికి వెయ్యి రోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైల్వే డిఆర్‌ఎం కార్యాలయం నుంచి జివిఎంసి గాంధీ విగ్రహం వరకూ వందలాది మందితో భారీ ప్రదర్శన, అనంతరం సభ నిర్వహించారు. జెఎసి చైర్మన్‌ ఎం.జగ్గునాయుడు, వైస్‌ చైర్మన్‌ ఎం.మన్మధరావు, కన్వీనర్‌ భోగవిల్లి నాగభూషణం అధ్యక్షతన జరిగిన సభలో సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను జిందాల్‌కు కట్టబెట్టేందుకు రహస్య ఒప్పందం చేసుకుందని తెలిపారు. ఆ ఒప్పందాన్ని బయటపెట్టాలని ఉద్యోగులు, కార్మికులు డిమాండ్‌ చేస్తున్నా పెడచెవిన పెడుతోందని అన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు ఉన్న విలువైన భూములను కాజేయడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ఉక్కు పరిరక్షణ కోసం జరుగుతున్న ఉద్యమానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున తమ మద్దతు తెలుపుతున్నారన్నారు. రాస్తారోకోలు, బంద్‌లు చేపడితే స్వచ్ఛందంగా పాల్గంటున్నారని గుర్తు చేశారు. ఇంతటి ప్రజా పోరాటాన్ని మోడీ ప్రభుత్వం ఖాతరు చేయకుండా ప్రయివేటీకరణ చర్యలు వేగవంతం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరించడం లేదని బిజెపి ఎంపి జివిఎల్‌.నరసింహారావు పదేపదే తప్పుడు ప్రకటనలు చేస్తుండడంపై మండిపడ్డారు. విశాఖ ప్రజలపై జివిఎల్‌కు ప్రేమ ఉంటే స్టీల్‌ మినిస్ట్రీతోనూ, మోడీతోనూ ప్రకటన చేయించాలని డిమాండ్‌ చేశారు. డి.ఆదినారాయణ మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరించడం కోసం సొంత గనులు కేటాయించడంలేదని, వర్కింగ్‌ క్యాపిటల్‌ ఇవ్వడం లేదని తెలిపారు. బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను మూసివేసే చర్యలకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం ఈ చర్యలు విడనాడకపోతే 2024 ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సభలో ఐఎఫ్‌టియు నాయకులు వెంకటేశ్వర్లు, సిఎఫ్‌టియుఐ నాయకులు సురేష్‌బాబు, టిఎన్‌టియుసి నాయకులు రామ్మోహన్‌రావు, కార్మిక నేత వెంకటసుబ్బయ్య తదితరులు మాట్లాడారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు జె.అయోధ్యరాం, కెఎస్‌ఎన్‌.రావు, యు.రామస్వామి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్‌, ఐద్వా విశాఖ జిల్లా అధ్యక్షులు బి.పద్మ, పిఒడబ్ల్యు రాష్ట్ర అధ్యక్షులు ఎం.లక్ష్మి, అంబేద్కర్‌ మెమోరియల్‌ అధ్యక్షులు బడ్డు కల్యాణరావు, హెచ్‌ఎంఎస్‌ నాయకులు దొమ్మేటి అప్పారావు, ఎఐసిటియు నాయకులు మోహన్‌రావు, ఎపిఎఫ్‌టియు నాయకులు దేవా, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు కార్యదర్శి భేగం, రైతు సంఘం నాయకులు జి.నాయనబాబు పాల్గొన్నారు.

➡️