ఇంధన రంగంలోరూ.22,302 కోట్ల పెట్టుబడులు- పలు ప్రాజెక్టులకు ఎస్‌ఐపిబి ఆమోదం

Jan 31,2024 08:53 #ap cm jagan, #speech

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఇంధన రంగంలో రూ.22,302 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపిబి) ఆమోదం తెలిపింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సిఎం అధ్యక్షతన ఎస్‌ఐపిబి సమావేశం మంగళవారం జరిగింది. దీనికి సిఎస్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. పెట్టుబడుల సమ్మిట్లో చేసుకున్న ఒప్పందాలు కార్యారూపం దాలుస్తున్నాయని, ముఖ్యంగా సాంప్రదాయేతర ఇంధన వనరుల విభాగంలో ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. రూ.22,302 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు రావడం అభినందనీయమని, దీనివల్ల 5,300 మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని పేర్కొన్నారు. అనంతరం పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. వీటిల్లో జెఎస్‌డబ్ల్యు నియో ఎనర్జీ లిమిటెడ్‌ 3,350 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. వైఎస్‌ఆర్‌ జిల్లా చక్రాయిపేట వద్ద 400 మెగావాట్లు, సత్యసాయి జిల్లా ముదిగుబ్బ వద్ద 1,050, అనంతపురం జిల్లా కనగానపల్లె, రాప్తాడులో 1,050, డి హీరేహళ్‌, బమ్మనహళ్‌లో 850 మెగావాట్లతో సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు రూపంలో రూ.12,065 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. దీనివల్ల 3,300 మందికి ఉపాధి లభించనుంది. దీంతోపాటు నంద్యాల జిల్లా అవుకు మండలం కునుకుండ్ల, కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గం వద్ద రూ.1,287 కోట్లతో 171 మెగావాట్ల రెండు విండ్‌ పవర్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నారు. సత్యసాయి జిల్లా తలుపుల మండలం పులిగుండ్ల పల్లెలో ఆగ్వాగ్రీన్‌ ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేటు లిమిటెడ్‌ 1000 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టును ఏర్పాటు ఏర్పాటు చేయనుంది. దీనికోసం రూ.4,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. కర్నూలు జిలా ఆస్పరి వద్ద ఎక్రోన్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ రూ.1,350 కోట్లతో 200 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. వీటితోపాటు రెన్యూ విక్రం శక్తి ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. దీనికోసం రూ.3,600 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. వీటన్నిటికీ ఎస్‌ఐపిబి ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుడివాడ అమర్‌నాథ్‌, సిఎస్‌ జవహర్‌రెడ్డి, ఎస్‌సిఎస్‌ విజయానంద్‌ తదితరులు పాల్గోన్నారు.

➡️