దిగిరాని వడ్డీ రేట్లుఆరోసారి యథాతథం-ఆర్‌బిఐ నిర్ణయం

Feb 9,2024 09:58 #Business

ముంబయి : గరిష్ట స్థాయికి చేర్చిన కీలక వడ్డీ రేట్లను తగ్గించడానికి ఆర్‌బిఐ మరోమారు నిరాకరించింది. వరుసగా ఆరోసారి మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) ద్రవ్య పరపతి సమీక్షలోనూ రెపో రేటును యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఆధ్యక్షతన మూడు రోజుల పాటు సాగిన ఎంపిసి భేటీ వివరాలను గురువారం ఆయన మీడియాకు వెల్లడించారు. రెపోరేటును 6.5 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. దాదాపు రెండేళ్ల నుంచి పెరుగుతూ వచ్చిన వడ్డీ రేట్లు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దీంతో గత ఏడాది ఫిబ్రవరి నుంచి రెపోరేటులో ఎలాంటి మార్పు చేయడం లేదు. తాజా నిర్ణయంతోనూ ఆరో సారి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించినట్లయ్యింది. విశ్లేషకుల అంచనాలను మించి భారత వృద్థి రేటు నమోదవుతుందని శక్తికాంత దాస్‌ అన్నారు. దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు బలంగా ఉన్నాయన్నారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి నియంత్రించాలనే లక్ష్యానికి అనుగుణంగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఆహార ధరలపై ఒత్తిళ్లను ద్రవ్య పరపతి విధాన కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందన్నారు. వచ్చే 2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ భారత ఆర్థిక కార్యకలాపాలు మెరుగ్గానే ఉంటాయని అంచనా వేశారు. ప్రభుత్వ మద్దతుతో పెట్టుబడులు పుంజుకుంటున్నాయన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ వినిమయం బాగానే ఉందన్నారు. వచ్చే 2024-25కు భారత జిడిపి 7 శాతం పెరగొచ్చని అంచనా వేశారు. ప్రస్తుత 2023-24లో రిటైల్‌ ద్రవ్యోల్బణం సూచీ 5.4 శాతంగా, వచ్చే 2014-15లో 4.5 శాతంగా ఉండొచ్చన్నారు. గడిచిన ఏడాది కాలంలో రూపాయి విలువ ఒడిదొడుకులను ఎదుర్కొందన్నారు.

పేటియంలో నిరంతరం ఉల్లంఘనలు

డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటియం నిరంతరం ఉల్లంఘనలకు పాల్పడిందని ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. అయితే ఆ సంస్థ అంశంలో వ్యవస్థాగతంగా ఎలాంటి లోపాలు లేవన్నారు. తరచుగా నిబంధనలను ఉల్లంఘించటం వల్లనే చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. సమస్య తీవ్రతను బట్టే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసమే పేటియంపై ఆంక్షలు విధించాల్సి వచ్చిందన్నారు. కాగా.. ఏ విషయంలో పేటియం నిబంధనలను పాటించలేదనేది దాస్‌ చెప్పడానికి నిరాకరించారు. బాధ్యతాయుత నియంత్రణ సంస్థగా ఉన్న ఆర్‌బిఐ వివిధ కంపెనీలతో పరస్పర అవగాహనతో పని చేస్తుందన్నారు. నిబంధనలు అమలు చేయడానికి తగినంత సమయం ఇస్తామన్నారు. పేటియంకు నిబంధనలకు కట్టుబడి ఉండడానికి ఆ కంపెనీకి కూడా సరిపడా సమయం ఇచ్చామన్నారు. నిబంధనలు పాటించడంలో ఏ స్థాయిలో విఫలమైతే రిజర్వ్‌ బ్యాంక్‌ తీసుకునే చర్య కూడా అదే స్థాయిలో ఉంటుందని దాస్‌ స్పష్టం చేశారు. ఫిన్‌టెక్‌, ఇన్నోవేషన్‌, టెక్నాలజీని ప్రోత్సహించడంలో రిజర్వ్‌ బ్యాంక్‌ నిబద్ధతపై ఎటువంటి సందేహాలు అక్కర్లేదన్నారు. గురువారం బిఎస్‌ఇలో పేటియం షేర్‌ 9.99 శాతం పతనమై రూ.446.65 వద్ద ముగిసింది.

➡️