హైదరాబాద్ :రాష్ట్రంలో జూన్ ఒకటి నుంచి జూనియర్ కాలేజీలకు కొత్త విద్యాసంవత్సరం (2024-25) ప్రారంభం కానుంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు అదే రోజు తరగతులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన జూనియర్ కాలేజీల అకడమిక్ క్యాలెండర్ను ఇంటర్ బోర్డు కార్యదర్శి శఅతి ఓజా శనివారం విడుదల చేశారు. మొత్తం 302 రోజులకుగాను ఆదివారాలు, పండుగలు, ఇతర సెలవులు 75 ఉన్నాయని తెలిపారు. వచ్చేవిద్యాసంవత్సరంలో జూనియర్ కాలేజీలకు 227 పనిదినాలుంటాయని స్పష్టం చేశారు. ఈ ఏడాది నవంబర్ 18 నుంచి 23వ తేదీ వరకు అర్థసంవత్సర పరీక్షలుంటాయని తెలిపారు. 2024, మార్చి మొదటివారంలో ఇంటర్ వార్షికలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రాక్టికల్ పరీక్షలుంటాయని వివరించారు. వచ్చేఏడాది జనవరి 20 నుంచి 25వ తేదీ వరకు ప్రీఫైనల్ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. జూనియర్ కాలేజీలకు చివరి పనిదినం మార్చి 29 అని పేర్కొన్నారు. అదేనెల 30 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు వేసవి సెలవులుంటాయని వివరించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే చివరి వారంలో నిర్వహిస్తామని తెలిపారు. 2025-26 విద్యాసంవత్సరంలో జూనియర్ కాలేజీలు వచ్చే ఏడాది జూన్ రెండో తేదీ నుంచి ప్రారంభమవుతాయని వివరించారు. అక్టోబర్ ఆరు నుంచి 13 వరకు దసరా సెలవులు, వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులుంటాయని తెలిపారు.
షెడ్యూల్ ప్రకారమే ప్రవేశాలు కల్పించాలి
రాష్ట్రంలోని ప్రయివేటు జూనియర్ కాలేజీలన్నీ ఆదివారం నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవుల్లో బంద్ చేయాలని శఅతి ఓజా యాజమాన్యాలను ఆదేశించారు. వేసవి సెలవులు, ఆదివారాలు, పండుగలకు ప్రభుత్వం ఆదేశాల ప్రకారం తప్పనిసరిగా సెలవు ప్రకటించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంటర్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ప్రవేశాల ప్రక్రియను చేపట్టాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు కల్పించిన కాలేజీలపై చర్యలు తీసుకుంటామేని హెచ్చరించారు.
అకడమిక్ క్యాలెండర్లో ముఖ్యాంశాలు
-జూన్ 1 నుంచి జూనియర్ కాలేజీలు ప్రారంభం
– నవంబర్ 18 నుంచి 23 వరకు అర్థసంవత్సరం పరీక్షలు
– జనవరి 20 నుంచి 25 వరకు ప్రీఫైనల్ ఎగ్జామ్స్
– ఫిబ్రవరి మొదటివారంలో ప్రాక్టికల్స్
– మార్చి మొదటివారంలో వార్షిక పరీక్షలు
-మార్చి 30 నుంచి జూన్ 1 వరకు వేసవి సెలవులు
– అక్టోబర్ 6 నుంచి 13 వరకు దసరా సెలవులు
– 2025, జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు