ముమ్మరంగా క్వారీల తనిఖీ

Apr 6,2024 21:49

 ప్రజాశక్తి భోగాపురం : మండలంలోని రామచంద్ర పేట సమీపంలో ఉన్న క్వారీలపై రెవిన్యూ, సర్వే, మైనింగ్‌ అధికారులు శనివారం ఉమ్మడి గా తనిఖీలు నిర్వహించారు. గత కొన్ని రోజుల నుంచి క్వారీల వ్యవహారంపై రామచంద్ర పేట గ్రామస్తులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాక ఇటీవల గ్రామ పెద్దలు జిల్లా కేంద్రంలో కలెక్టర్‌, మైనింగ్‌, పొల్యూషన్‌ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో జిల్లా కేంద్రంలో మైనింగ్‌, సర్వే అధికారులతో పాటు స్థానిక తహశీల్దార్‌ శ్యాం ప్రసాద్‌ 5 క్వారీలను గ్రామస్తుల సమక్షంలోనే తనిఖీ చేశారు. ఈ నివేదికను జిల్లా కలెక్టర్‌ కు అందజేయనున్నారు. గ్రామ సమీపంలోని ఐదు క్వారీల్లో గ్రామస్థుల సమక్షంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనిల్‌ క్వారీలో ఎంత లోతు లో తవ్వారో కొలతలు తీసుకున్నారు. జిఎంఆర్‌ కొత్తగా పనులు ప్రారంభించిన క్వారీ నుంచి గ్రామంలోని పాఠశాల వరకు ఎంత దూరం ఉందో కొలతలు వేసారు. గ్రామానికి ఎంత దూరంలో ఈ క్వారీలు ఉన్నాయనేది కూడా కొలతలతో సహా పరిశీలించారు. ఉన్నత అధికారులకు నివేదిక ఇచ్చిన తర్వాత కొన్ని ప్రారంభించాలని జిఎంఆర్‌ సిబ్బందికి అధికారులు ఆదేశించారు. కొండరాజుపాలెం పంచాయతీ సమీపంలో ఉన్న నర్సింగ్‌ రావుక్వారీని కూడా అధికారులు పరిశీలించారు. ఈ క్వారీ వలన తాగునీరు కలుషితమవుతుందని తాగునీటి బోర్లను అధికారులకు గ్రామస్తులు చూపించారు. మండల సర్వేయర్‌ ముదికేశ్వరరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు తనిఖీ నివేదిక కలెక్టర్‌కు అందజేస్తాం రామచంద్ర పేట సమీపంలోని క్వారీలను మైనింగ్‌, సర్వే అధికారులతో గ్రామ పెద్దల సమక్షంలో తనిఖీలు చేశామని తహశీల్దార్‌ పి.శ్యాం ప్రసాద్‌ తెలిపారు.మైనింగ్‌ అధికారులు ఇచ్చే నివేదికను కలెక్టర్‌ కు అందజేస్తామని చెప్పారు.

➡️