కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల బైఠాయింపు

Jan 3,2024 15:40 #Anganwadi strike, #Kakinada
  • జగన్ భవిషత్తును నిర్ణయించేది అంగన్వాడీ
  • డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదు
  • మోడీ, జగన్ జోడీలకు బుద్ధి చెప్తామని నినాదాలు

ప్రజాశక్తి:కాకినాడ : అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె 23వ రోజు వేలాదిమంది అంగన్వాడీలు కాకినాడ కలెక్టరేట్ వద్ద భైటాయించి నిరసన తెలియజేశారు. మాట తప్పిన జగన్ అంటూ నినాదాలు చేశారు. సావిత్రిభాయి ఫూలే 193వ జయంతి సందర్బంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబిరాణి, సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషాబాబ్జి మాట్లాడుతూ ఇప్పటివరకు జరిగిన ఐదు దపాల చర్చల సందర్భంగా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రర్స్ ఆర్థికపరమైన అంశాలను పక్కనపెట్టి, సర్వీసుకి సంబంధించి చర్యలు మాత్రమే అంగీకరించారని, జనరల్ డిమాండ్ అయిన వేతన పెంపు చేసేంతవరకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు. అంగన్వాడీల వేతనాల పెంపుకి ఆర్ధిక పరిస్థితి బాలేదని చెప్తున్న జగన్ ప్రబుత్వానికి ఎమ్మెల్యే, ఎంపీల వేతనాలు లక్షల్లో తీసుకోవడానికి, సజ్జల వంటి 33 మంది సలహాదారులకు 3లక్షల చొప్పున వేతనాలు చెల్లించడానికి ఆర్ధిక పరిస్థితి ఎలా సహకరించిందని ప్రశ్నించారు. అంగన్వాడీ టీచర్, ఆయామ్మ చాలి చాలని జీతాల నుండి సెంటర్ అద్దెలు, వంటకు గ్యాస్ బండ పెట్టుబడి పెడుతూ ఇంటికి సగం వేతనం కూడా తీసుకువెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2017 నుండి కేంద్రం విడుదలచేసిన టీఏ బిల్లులు అంగన్వాడీలకు చెల్లించకుండా జగన్ ప్రభుత్వం నిధులను దారి మళ్లించిందని, బకాయిలు చెల్లించకుండా ఇప్పటి నుండి అమలుచేస్తామని చెప్పడం అన్యాయమన్నారు. తక్షణం మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరెంటు చార్జీలు, నిత్యావసరాల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన జగన్, మోడీ ప్రభుత్వాలకు అంగన్వాడీల వేతనాలు పెంచడం తెలియదా అని ప్రశ్నించారు. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చాక కూడా అవసరమైతే నిరవధిక సమ్మె కొనసాగించడానికి అంగన్వాడీలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం నేనే సావిత్రిభాయ్ ఫూలే అనే పుస్తకాన్ని ఆవిష్కరించి, బాలాచెరువు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.

కనీస వేతనం అంగన్వాడీలకు 26 వేలు చెల్లించాలని నిత్యవసర సరుకుల ధరలు తగ్గించాలని లబ్ధిదారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని 2017 నుండి పెండింగులో ఉన్న టిఏ బిల్లులను బకాయిలతో సహా చెల్లించాలని, తెలంగాణ కంటే అదనంగా వేతనాలు చెల్లిస్తానని జగన్ హామీ అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కన్వీనర్ మోర్తా రాజశేఖర్, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమణి, ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్ స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నిట్ల శ్రీను, రొంగల ఈశ్వరరావు పెన్షనర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సత్తిరాజు, 104 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్సలు త్రిమూర్తులు, శ్రీకాంత్, ఏపీఎంఎస్ఆర్ యు రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ నక్కెళ్ల శ్రీను, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, సహాయ కార్యదర్శి క్రాంతి కోశాధికారి మలకా రమణ, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు జీవా, ధనలక్ష్మి, రాజా తదితరులు మద్దతుగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎపి అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దడాల పద్మ, ఏరుబండి చంద్రావతి, కోసాధికారు రమణమ్మ, జిల్లా నాయకులు నాగమణి, ధనలక్ష్మి, ఎస్తేరు రాణి దాడి బేబి, మేరీ సమాధానం, బుల్లెమ్మ, సునీత, సుజాత, రాజేశ్వరి, వెంకటలక్ష్మి, జ్యోతి, వీరమని, వీరవేణి, నీరజ నాయకత్వం వహించారు.

➡️