పన్నూన్‌ హత్య కేసు.. నిందితుడు గుప్తాను అప్పగించేందుకు కోర్టు అనుమతి

న్యూఢిల్లీ : ఖలీస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌ హత్యకు కుట్ర పన్నిన కేసులో భారత్‌కు చెందిన నిందితుడు నిఖిల్‌ గుప్తా (52)ను అమెరికాకు అప్పగించేందుకు చెక్‌ కోర్టు (సుప్రీంకోర్టు) అనుమతించింది. తనను అమెరికాకు అప్పగించవచ్చని దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టివేయాలంటూ గుప్తా చెక్‌ కోర్టుకు అప్పీల్‌ చేశారు. అయినప్పటికీ గుప్తా అప్పీల్‌ని చెక్‌ కోర్టు తోసిపుచ్చింది. ఈ నిర్ణయాన్ని న్యాయ మంత్రిత్వశాఖ శుక్రవారం వెల్లడించింది. అయితే ఈ కేసులో తుది నిర్ణయం న్యాయ శాఖామంత్రి పావెల్‌ బ్లేజెక్‌ చేతుల్లోనే ఉంది.

కాగా, గుప్తాను ఎప్పటిలోగా అమెరికాకు అప్పగించాలనే కాలపరిమితిని న్యాయశాఖా మంత్రి వెల్లడించలేదని చెక్‌ న్యాయ మంత్రిత్వశాఖ ప్రతినిధి తెలిపినట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కొంది. అయితే దిగువ కోర్టు నిర్ణయాలకు సంబంధించి ఏమైనా సందేహాలు తలెత్తితే చెక్‌ సుప్రీం కోర్టు అభిప్రాయాన్ని కోరేందుకు న్యాయమంత్రికి మూడు నెలల సమయం ఉందని మంత్రిత్వశాఖ ప్రతినిధి తెలిపారు.

గుప్తాను గతేడాది జూన్‌లో చెక్‌ రిపబ్లిక్‌ పోలీసులు పర్వాగ్వేలో అదుపులోకి తీసుకున్నారు. ఖలిస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్‌సింగ్‌ పన్నూన్‌ను హతమార్చేందుకు.. నిఖిల్‌ గుప్తా భారత ప్రభుత్వ అధికారికి సహకరించారని అమెరికా ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. అయితే ఈ హత్య కేసులో తాను నిందితుడిని కాదని గుప్తా ఆరోపించాడు. రాజకీయ కారణాల వల్లే తనను ఈ కేసులో ఇరికిస్తున్నారని, తాను న్యాయపోరాటానికి సిద్ధపడతానని గుప్తా పేర్కొన్నాడు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఒక ఉన్నతస్థాయి భారతీయ అధికారి ప్రమేయం ఉందని, అతనే హత్యకు పన్నాగం పన్నినట్లు ఆరోపణలు వచ్చాయని గతేడాది ఫైనాన్షియల్‌ టైమ్స్‌ నివేదించింది. భారతీయ అధికారి (సిసి-1), పన్నూన్‌ హత్యకు సంబంధించి గుప్తాకు కమ్యూనికేట్‌ చేసినట్లు ఆధారాలున్నాయని యుఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ పేర్కొంది. గుప్తా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ట్రాఫికర్‌ అని, పన్నూన్‌ హత్య కేసులో గుప్తా.. భారతీయ అధికారిని న్యూఢిల్లీలో వ్యక్తిగతంగా కలిశాడు. అలాగే న్యూయార్క్‌ నగరంలో పన్నూన్‌ హత్య కోసం ఆ అధికారికి గుప్తా లక్ష డాలర్లు చెల్లించినట్లు అమెరికా ఆరోపిస్తోంది. గుప్తా న్యూయార్క్‌ సిటీ కోర్టులో హాజరైనప్పుడు మాత్రమే అతనిపై అభియోగాలకు సంబంధించిన సాక్ష్యాలను అందజేస్తామని అమెరికా ప్రభుత్వం వాదించింది. ఈ నేరం రుజువైతే గుప్తాకు 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఖలిస్తానీ నేత పన్నూన్‌కి కెనాడాతోపాటు అమెరికా పౌరసత్వం కూడా ఉంది.

➡️