భారత క్రికెటర్‌ రిటైర్మెంట్‌ – మైదానంలో భావోద్వేగం..!

Mar 15,2024 11:36 #Emotion, #Indian Cricketer, #Retirement

ముంబై : టీమిండియా క్రికెటర్‌ ధావల్‌ కులకర్ణి (35) ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో విదర్భతో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్‌ అనంతరం కులకర్ణి భావోద్వేగంతో కంటితడి పెట్టారు. తన చివరి మ్యాచ్‌లో ముంబై జట్టును కులకర్ణినే విజయతీరాలకే చేర్చడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

విదర్భతో జరిగిన ఫైనల్‌లో ధావల్‌ కులకర్ణి తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్‌ తీశారు. చివరి మ్యాచ్‌ ఆడుతున్న కులకర్ణికి.. మ్యాచ్‌ ముగించాలని ముంబై కెప్టెన్‌ అజింక్య రహానే బంతిని అందించారు. కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెడుతూ.. ఉమేశ్‌ యాదవ్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేసి జట్టును ఛాంపియన్‌గా నిలిపారు. అనంతరం కులకర్ణి భావోద్వేగానికి లోనయ్యారు. ఆటగాళ్లను హత్తుకొని కంటతడిపెట్టారు. ముంబైలోని ప్రతి ఆటగాడు కులకర్ణికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

కులకర్ణి వీడ్కోలుపై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించారు. ‘ముంబై యోధుడివి.. అద్భుతమైన కెరీర్‌’ అంటూ కులకర్ణి ఫొటోతో రోహిత్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టారు.

ఫైనల్‌ ముగిసిన అనంతరం ధావల్‌ కులకర్ణి మాట్లాడుతూ … ”కెరీర్‌ ఆరంభాన్ని, ముగింపును అత్యున్నతంగా ముగించడం ప్రతి క్రికెటర్‌ కల. ముంబై తరఫున ఫైనల్‌ ఆడటం నాకు ఇది ఆరోసారి. అందులో అయిదు సార్లు టైటిళ్లు గెలిచాం. మ్యాచ్‌ను ముగించాలని రహానె నాకు బంతి అందివ్వడం గొప్పగా అనిపించింది. అసలు ఊహించలేదు. ఈ విషయంలో తుషార్‌ దేశ్‌పాండేకు కూడా థ్యాంక్స్‌ చెప్పాలి. తన చివరి రెండు ఓవర్లలో అతడు రెండు వికెట్లు తీసి కూడా నాకు బంతిని ఇవ్వడానికి అంగీకరించాడు” అని కులకర్ణి పేర్కొన్నారు.

ధావల్‌ కులకర్ణి తన కెరీర్‌లో 95 ఫస్ట్‌ క్లాస్‌, 130 లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు ఆడారు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 281 వికెట్లు, లిస్ట్‌-ఏ మ్యాచ్‌ల్లో 154 వికెట్లు పడగొట్టారు. మరోవైపు భారత్‌ తరఫున కులకర్ణి 12 వన్డేలు, 2 టీ20లు ఆడారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతడు 22 వికెట్లు పడగొట్టారు. 2014 అరంగేట్రం చేసిన కులకర్ణి.. 2016 తర్వాత అవకాశాలు రాలేదు. ఇక 92 ఐపీఎల్‌ మ్యాచులలో 86 వికెట్స్‌ తీశారు.

➡️