వేధింపుల కేసులో భారత అమెరికన్‌ జంటకు 20 ఏళ్ల శిక్ష !

  • దోషులుగా నిర్ధారించిన వర్జీనియా కోర్టు
  • మే 8న శిక్ష ఖరారు

న్యూయార్క్‌ : అమెరికాలోని వర్జీనియా ఫెడరల్‌ జ్యూరీ రెండు వారాల విచారణ అనంతరం ఒక భారతీయ అమెరికన్‌ జంటను దోషులుగా నిర్థారించింది. ఈ దంపతులు తమ బంధువును వేధించారని స్పష్టమైన నేపధ్యంలో జ్యూరీ వారిని దోషులుగా తేల్చిచెప్పింది. ఆ భారతీయ అమెరికన్‌ జంట తమ గ్యాస్‌ స్టేషన్‌, కన్వీనియన్స్‌ స్టోర్‌లో తమ బంధువును కార్మికునిగా నియమించుకునేందుకు బలవంతంగా ప్రయత్నించిందని ఫెడరల్‌ జ్యూరీ నిర్ధారించింది. ఈ కేసులో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (30), కుల్బీర్‌ కౌర్‌(43)లు దోషులుగా తేలడంతో వారికి 2024, మే 8న శిక్ష ఖరారు చేయనున్నారు. హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, కుల్బీర్‌ కౌర్‌ దంపతులు తమ బంధువు చేత ఆహారాన్ని వండించడం, క్యాషియర్‌గా పని చేయించడం, స్టోర్‌ రికార్డులను శుభ్రపరచడం, నిర్వహించడం తదితర పనులు బలవంతంగా చేయించారు. ఇటువంటి కేసులలో గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష విధించేందుకు అవకాశం ఉంది. అలాగే 2,50,000 అమెరికన్‌ డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌, పౌర హక్కుల విభాగానికి చెందిన అసిస్టెంట్‌ అటార్నీ జనరల్‌ క్రిస్టెన్‌ క్లార్క్‌ మాట్లాడుతూ ఈ దంపతులు.. యునైటెడ్‌ స్టేట్స్‌లో పాఠశాలకు వెళ్లాలనే బాధితుని ఆశను అణగార్చారని, శారీరక, మానసిక వేధింపులకు గురి చేశారని అన్నారు. బాధితుని ఇమ్మిగ్రేషన్‌ పత్రాలను దాచేయడం, తీవ్రమైన హాని కలిగించే ఇతర బెదిరింపులకు గురిచేయడం, కనీస వేతనం కూడా చెల్లించకపోవడం, అధికంగా పనిచేయించడం లాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని అసిస్టెంట్‌ అటార్నీ జనరల్‌ పేర్కొన్నారు.

➡️