వర్షంతో రైతుల్లో పెరుగుతున్న ఆందోళన

Dec 4,2023 23:55

ప్రజాశక్తి – పంగులూరు
మీచౌంగ్ తుఫాను కారణంగా కురుస్తున్న వర్షానికి శనగ రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో రబీలో 6,645ఎకరాలు శనగ సాగు చేశారు. మరో 2,500ఎకరాల వరకు సాగయ్యే అవకాశం ఉంది. గత 15రోజుల నుండి శనగ ఎద పెడుతున్నారు. కొంత భాగం మొక్క పైకి రాగా, కొంత పొలం ఇంకా మొక్క భూమిలోనే ఉండి పోయింది. వర్షం ఉద్ధృతి పెరు గుతున్నడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది రైతులు శనగ సాగుపై ఎక్కువ మక్కువ చూపారు. శనగలు క్వింటా రూ.12వేల నుండి రూ.13వేల వరకు ధర పలుకుతుండటంతో రైతులు శనగ సాగు పట్ల ఆసక్తి చూపారు. తుఫాను కారణంగా ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు తమ పొలాల్లోని శనగపైరు ఉంటుందా? మురిగిపోతుందా? అర్థం కాని స్థితిలో రైతులు ఉన్నారు. మొలక రాని పొలం రైతులు నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూమిపైకి వచ్చిన మొక్కలు కూడా వర్షం ఇదే విధంగా రెండు రోజుల కురిస్తే మునిగిపోయి ఉరకెత్తిపోయే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. శనగ రైతులు ఎకరానికి విత్తనాలు, వ్యవసాయానికి, ఎరువులకు కలిపి రూ.15వేల వరకు పెట్టుబడులు పెట్టారు. ఇది మొత్తం నష్టపోవాల్సి వస్తుందని చెబుతున్నారు. మంచి ధర ఉన్నప్పటికీ వర్షం నిరాశ మిగిల్చింది.

➡️