క్రీడలతో పెరగనున్న పోటీతత్వం

Nov 28,2023 23:52

ప్రజాశక్తి – బాపట్ల
విద్యార్థుల్లో పోటీతత్వం పెరగడానికి క్రీడలు అత్యుత్తమ మార్గాలని ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆర్ శారదా జయలక్ష్మిదేవి అన్నారు. స్థానిక వ్యవసాయ కళాశాలలో ఈనెల 30వరకు మూడు రోజులు పాటు జరిగే ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అంతర అనుబంధ కళాశాలల ప్రథమ దశ ఆటల పోటీలను ఆమె మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణకు, మానసిక వికాసానికి యువతకు క్రీడలు ఎంతగానో దోహద పడతాయని అన్నారు. ఆటల పోటీల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులకు టీమ్ వర్క్, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని అన్నారు. విభేదాల జోలికి వెళ్లకుండా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆటలు ఆడుకోవాలని సూచించారు. విద్యార్థుల మధ్య చెలరేగే సంఘర్షణలను సైతం క్రీడల్లో కలిసి మెలసి పాల్గొనడం ద్వారా నిరోధించవచ్చని అన్నారు. విశ్వ విద్యాలయ పరిధిలోని అన్ని కళాశాలల్లో క్రీడలకు సంబంధించిన వసతుల మెరుగుపరుస్తామని తెలిపారు. ఆర్‌డిఒ గంధం రవీందర్ మాట్లాడుతూ వ్యవసాయ ఆవశ్యకతను, ప్రాముఖ్యతను వివరించారు. దేశ ప్రజలకు ఆహారాన్ని అందించే వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు ఎంతగానో తోడ్పడతాయని అన్నారు. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ వి శ్రీనివాసరావు మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే క్రీడల పోటీలకు 18కళాశాలలకు చెందిన 400మందికి పైగా విద్యార్థులు పాల్గొంటున్నారని అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం లాక్ డౌన్ యేడాది మినహాహాయించి వరుసగా ఆరు సార్లు క్రీడలను నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ పి సాంబశివరావు, రిజిస్టార్ జి రామారావు, వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల అసోసియేట్ డీన్ డి స్మిత్, ఎన్‌టిఆర్ కాలేజీ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అసోసియేట్ డీన్ వై రాధ, విశ్వ విద్యాలయ ఫిజికల్ డైరెక్టర్ ఆర్ రవికాంత్‌రెడ్డి, టివి శ్రీధర్ పాల్గొన్నారు.

➡️