పల్నాడులో పెరిగిన దాడులు

Apr 19,2024 00:32

నాదెండ్లలో గ్రామస్తులతో మాట్లాడుతున్న పల్నాడు ఎస్‌పి బిందుమాధవ్‌
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి :
పల్నాడు జిల్లాలో ఎన్నికల కేసులు పెరుగుతున్నాయి. టిడిపి నాయకులు, కార్యకర్తలపై అధికార పార్టీ దూకుడుగా ప్రవర్తిస్తోందని పలుచోట్ల దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని పోలీసు అధికారులకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదు అందుతున్నాయి. ఎన్నికల సమయం కావడంతో అధికారులు కూడా గతంలో మాదిరిగా రాజకీయ వత్తిడికి తలవొగ్గకుండా ఫిర్యాదులపై తక్షణమే స్పందించి కేసులు నమోదు చేస్తున్నారు. కొన్ని కేసుల్లో ఇప్పటికే నిందితులను అరెస్టు చేశామని, బెయిబుల్‌ కేసుల్లో 41ఎ కింద నోటీసులు ఇచ్చి బైండోవర్‌ చేస్తున్నామని, మిగతా కేసుల్లో నిందితులను అరెస్టుకు ప్రయత్నిస్తున్నామని జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. పల్నాడు జిల్లాలో శాంతి భద్రతలకు సంబంధించి ఎటువంటి సమస్య తలెత్తినా పోలీసు వారు వెంటనే స్పందిస్తున్నట్టు జిల్లా ఎస్‌పి జి. బిందుమాధవ్‌ చెప్పారు.మాచర్ల నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి జూలకంటి బ్రహ్మరెడ్డి అనుచరులు ప్రచారం చేస్తుండగా వైసిపి నేతలు దాడి చేశారు. టిడిపి నాయకులు జలీల్‌ఖాన్‌ ఇచ్చిన ఫిర్యాదుపై ఆరుగురు వైసిపి కార్యకర్తలను అదుపులోకి తీసుకుని బైండోవర్‌ చేశారు. నర్సరావుపేట లోక్‌సభ నియోజకవర్గం టిడిపి అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు ప్రచార వాహనాన్ని ధ్వంసం చేసి, ‘ఇది మా అడ్డ ఇక్కడకు ఎవడు పంపించాడు రా నిన్ను’ అంటూ వాహన డ్రైవర్‌పై దాడి కేసులో కూడా నిందితులపై కేసు నమోదు చేసి బైండోవర్‌ చేశారు. గత నెల 17న మాచర్లలో టిడిపి నాయకుడి కారును వైసిపి నాయకులు తగలబెట్టారు. ఈ కేసులోకూడా నిందితులను బైండోవర్‌ చేశారు. క్రోసూరులో చంద్రబాబు ప్రజాగళం సభ జరిగిన మరుసటి రోజే తేదేపా కార్యాలయాన్ని దుండగులు తగుల పెట్టిన కేసు దర్యాప్తులో ఉంది. వెల్దుర్తి మండలం కొత్త పుల్లారెడ్డి గూడెం లో ముడావత్‌ తులసి నాయక్‌ తలపై గొడ్డలితో దాడి చేసి ఆయన దుకాణం, ఆటో ధ్వంసం చేశారని ఫిర్యాదు అందింది.నిందితులను గుర్తించి కేసు నమోదు చేసి బైండోవర్‌ చేశారు. కారంపూడి మండలం కాకానివారిపాలెం ఎస్‌సి కాలనీలో కడియం నాగరాజుపై గొడ్డలితో దాడి చేసిన ఘటనలో కేసు నమోదైంది. నిందితులను గుర్తించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం ముందే దాడులు పెరిగితే రానున్న 25 రోజుల్లో ఎలాంటి ఘటనలు జరుగుతాయోనని అధికారులు కొంత ఆందోళనకు గురవుతున్నారు. పల్నాడు ఎస్‌పి రవిశంకర్‌రెడ్డిని మార్చి నూతన ఐపిఎస్‌ బిందుమాధవ్‌ను నియమించిన తరువాత ఎప్పటికప్పుడు ప్రజల నుంచి, పార్టీల నుంచి వచ్చే ఫిర్యాదులపై స్పందిస్తున్నారు.
స్వేచ్ఛగా ఓటేయండి : పల్నాడు ఎస్పీ బిందుమాదవ్‌
సార్వత్రిక ఎన్నికలు -2024 దష్ట్యా ప్రజలు ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా వినియోగించుకునే విధంగా పోలింగ్‌ కేంద్రాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేశామని పల్నాడు జిల్లా జి.బిందుమాధవ్‌ అన్నారు. పల్నాడు జిల్లాలోని పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, సాధారణ అనే విధంగా విభజించామని, దానికి తగ్గట్టు బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. నాదెండ్ల మండలంలోని అమీన్‌ సాహెబ్‌ పాలెం, కనపర్రు, సాతులూరు, చందవరం, చిరుమామిళ్ల, నాదెండ్ల గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలను ఎస్పీ గురువారం సందర్శించి భద్రతా ఏర్పాట్లు గురించి పోలీసు అధికారులకు సూచించారు. స్థానికులతో మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని ఎవరూ ఉల్లంఘించొద్దన్నారు. ఎవరైనా నిబంధనలు మీరితే పోలీసులకు తెలపాలని సూచించారు. ప్రజలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాన్నారు.

➡️