శీతాకాలంలో … ఆరోగ్య సమస్యలు .. అప్రమత్త పద్ధతులు …

Dec 16,2023 09:58 #Jeevana Stories

చలితో గజగజ వణికిపోతున్నాం. చలి నుంచి రక్షణగా, చాలామంది తక్షణ ఉపశమనం కోసం టీ, కాఫీలు ఎక్కువగా తాగుతుంటారు. దీనివల్ల పొట్టలో అల్సర్‌ సమస్య తలెత్తుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆహార అలవాట్లను మార్చుకుంటే గాని, ఈ చలికాలం సమస్యల నుంచి ఉపశమనం రాదు. ఆరోగ్యంతో పాటు ఈ కాలం శరీరం కూడా చలికి ప్రభావితమౌతుంది. కాబట్టి మనం తీసుకునే రక్షణ చర్యలు శరీరాన్ని, ఆరోగ్యాన్ని కాపాడేవిగా ఉండాలి.

నీళ్లు తాగాలి

చలికాలంలో దాహం తక్కువగా అవుతుంది. దాంతో సరిపడినన్ని నీళ్లు తాగకపోవడం వల్ల జీర్ణవ్యవస్థ సమస్యలు తలెత్తుతాయి. శరీరమూ పొడిబారుతుంది. అందుకే దాహం లేకపోయినా, రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీటిని కొంచెం కొంచెంగా తీసుకోవాలి. దాహంగా లేదని నీళ్లు తాగకుండా ఉంటే శరీరం డీ హైడ్రేషన్‌ అవుతుంది. దాంతో ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తుతాయి.

junk food
junk food

జంక్‌ ఫుడ్‌ తగ్గించాలి

చలికాలం వచ్చిదంటే చాలా మంది జంక్‌ ఫుడ్‌ అధికంగా తినేందుకు ఇష్టపడతారు. కారం కారంగా, వేడిగా ఉండాలంటూ బాగా మసాలా వేసి చేసే ఫుడ్‌ను తింటూ ఉంటారు. ఇలా తింటే జీర్ణకోశ సమస్యలకు దారితీయవచ్చు. ఊబకాయం, మధుమేహం వంటి దీర్ఘ కాలిక సమస్యలకు దారి తీయొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అదుపులో కార్బోహైడ్రేట్స్‌

చలికాలంలో శరీరంలో సెరోటోనిన్‌ హార్మోన్‌ స్థాయిలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణుల అంటున్నారు. అందువల్ల మనకు ఎక్కువగా.. కార్బోహైడ్రేట్స్‌ ఉన్న ఆహారం తీసుకోవాలనే కోరిక కలుగుతుంది. రైస్‌, బ్రెడ్‌, అరటి, దుంపల్లో కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి రోజూ తీసుకోవడం వల్ల రక్తపోటు, మధుమేహం స్థాయిలు పెరుగుతాయి. అందుకే ఈ ఆహారం పట్ల కూడా అదుపు ఉండాలి.

జలుబు, దగ్గు నుంచి ఉపశమనం

చలికాలంలో జలుబు, దగ్గు వచ్చినప్పుడు చిన్నా, పెద్దా తేడా లేకుండా గాలి పీల్చుకోవడం, వదలడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కొన్ని నియమాలు పాటిస్తే ఉపశమనం కలుగుతుంది.

  • తులసి ఆకుల్లో యాంటి బయాటిక్స్‌ ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజూ నాలుగు ఆకులు నోట్లో పెట్టుకుని, నిదానంగా నమలడం వల్ల జలుబు, ఫ్లూ రావు. కడిగిన తులసి ఆకుల ను మరిగించిన నీళ్లలో వేసి తాగితే గొంతులో కఫం నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • అల్లంలోని గుణాలు రోగనిరోధక శకిన్తి బలపరచేలా చేస్తుంది. గొంతు నొప్పితో బాధపడే వారు వేడి పాలలో గానీ, కషాయంలోగానీ అల్లం వేసుకుని తాగాలి.ొ
  • చిన్న పిల్లలకు జలుబు చేసినప్పుడు కఫం పేరుకుపోతుంది. అప్పుడు అర లీటర్‌ నీటిలో స్పూన్‌ వాముపొడి, స్పూన్‌ పసుపు వేసి చల్లారాక తేనె కలిపి కొంచెం కొంచెంగా తాగించాలి. దాంతో కఫం కరిగిపోతుంది. మెత్తగా దంచిన వామును ఒక స్పూన్‌ తీసుకుని, గ్లాస్‌ మజ్జిగలో కలిపి తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు గాలిని చేరవేసే మార్గం శుభ్రపడుతుంది.
  • రోజూ రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలల్లో కాస్త పసుపు, మిరియాల పొడి వేసుకుని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు శరీరంలో చలి తగ్గుతుంది.
  • కర్పూరాన్ని నువ్వుల నూనెలో కరిగించి దాంతో తల, ఛాతీ, పాదాలకు మసాజ్‌ చేస్తూ ఉండాలి. జలుబు బాగా చేసినప్పుడు వేడినీటిలో స్పూను పసుపు, కర్పూరం వేసి ఆవిరి పట్టాలి.
➡️